పాకిస్థాన్‌లో కలకలం… ఆర్థిక మంత్రి రాజీనామా…


ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న ఆరోపణల నడమ ఆ దేశ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సంక్షోభ సమయంలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలతోపాటు వ్యాపార వర్గాలు విమర్శిస్తున్న నేపథ్యంలో అసద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
అసద్ ఇటీవలే అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)తో చర్చలు జరిపారు. పాకిస్థాన్‌కు ఉద్దీపన నిధిని ఖరారు చేశారు. ఆయన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదులుగా ఇంధన శాఖ తీసుకోవాలని ఇమ్రాన్ కోరారు. అయితే తాను ఎటువంటి మంత్రి పదవిని తీసుకోబోనని చెప్పానని, అందుకు ఇమ్రాన్ సమ్మతించారని అసద్ తెలిపారు.
 
విలేకర్ల సమావేశంలో అసద్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇది అని తెలిపారు. తనను పదవి నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతున్నదో, లేదో తనకు తెలియదన్నారు. తన కెప్టెన్ (ఇమ్రాన్ ఖాన్) తనను ఇంధన శాఖ మంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తెలిసిందని, అందుకు తాను తిరస్కరించానని చెప్పారు.
 
తన అమెరికా పర్యటన గురించి ప్రస్తావిస్తూ గతంలో కన్నా మెరుగైన నియమ, నిబంధనలతో ఐఎంఎఫ్ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయమని, తాను అటువంటి నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. దేశాన్ని అణగదొక్కే నిర్ణయాలు తీసుకోవడానికి తాను తిరస్కరించానన్నారు.
 
సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు 8 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్ కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి మిత్ర దేశాల నుంచి 9.1 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆర్థిక సాయం పొందింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *