పాక్‌లో 'జైశ్రీరామ్' అనాలా? : అమిత్‌షా


మిడ్నాపోర్: ‘జై శ్రీరామ్’ నినాదంతో మమతా బెనర్జీకి సమస్య ఉన్నట్టు కనిపిస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఘటల్‌లో మంగళవారంనాడు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా ఎవరైనా ‘జై శ్రీరామ్’ అంటే మమతా బెనర్జీ ఉలిక్కిపడుతుండటం, అదేదో సమస్యగా ఆమె చూస్తుండటం తాను గమనించానని అన్నారు. జైశ్రీరామ్ అని ఇక్కడ (ఇండియాలో) కాకపోతే, పాకిస్థాన్‌లో అంటామా అని మమతను తాను ప్రశ్నించదలచుకున్నానని, జైశ్రీరామ్ అనకుండా తమను ఎవరూ ఆపలేరని అమిత్‌షా సవాలు చేశారు.
 
మమత కాన్వాయ్ వెళ్తుండగా ‘జైశ్రీరామ్’ నినాదాలు చేసిన ముగ్గురు వ్యక్తులను ఇటీవల అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో అమిత్‌షా తాజా వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తమ పార్టీ 23కు పైగా లోక్‌సభ స్థానాలకు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘మమతా దీదీ… మీరు మా ర్యాలీలు అడ్డుకునే ప్రయత్నాలు చేయొచ్చు, అబద్ధాలు ప్రచారం చేయెచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మే 23న బీజేపీ 23కు పైగా సీట్లు గెలుచుకోకుండా మాత్రం అడ్డుకోలేరు’ అని అన్నారు. మోదీని తాను ప్రధానిగా పరిగణించడం లేదని మమత చెబుతున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజలే ప్రధానిని ఎన్నుకుంటున్నారన్న విషయం ఆమెకు తెలియకపోవడం విడ్డూరమని అమిత్‌షా ఎద్దేవా చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *