పీఎం సీటు వేలంలో పెడితే పోటీ వారి మధ్యే.. దీదీ, కాంగ్రెస్‌పై మోదీ ఫైర్


అసాన్‌సోల్: ప్రధాని మోదీ అటు టీఎంసీపైన, ఇటు కాంగ్రెస్‌పైన వాడివేడి విమర్శలు గుప్పించారు. పీఎం పోస్టుకు వేలం పెడితే దీదీ, కాంగ్రెస్ పోటీపడతారంటూ, అవినీతిలో ఇద్దరూ ఇద్దరేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని అసాన్‌సాల్‍లో మంగళవారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో రికార్డు సృష్టించిందని, ఇవాళ టీఎంసీ ప్రభుత్వం ఆ రికార్డులో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోందన్నారు. టీఎంసీ హయాంలో అవినీతి, నేరాలు అప్రతిహతంగా సాగుతున్నాయని ఆరోపించారు. స్పీడ్ బ్రేకర్ దీదీ పాత్ర కూడా అందులో ఉందన్నారు.
 
బంగ్లాదేశ్ నటులను ఎన్నికల ప్రచారానికి టీఎంసీ వాడుకోవడంపై మరోసారి ప్రధాని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారానికి సరైన వాళ్లెవరూ రాకపోవడంతో విదేశాల్లోని నటులను బలవంతంగా తీసుకువస్తున్నారని, ఎందరో ధీమంతులకు పెట్టింది పేరైన బెంగాల్‌కు అటువంటి వాళ్లను తీసుకురావడం చూస్తే దీదీపై జాలి కలుగుతుతోందన్నారు.
 
‘గణనీయంగా సీట్లు సాధించి ప్రధాని పదవిని కైవసం చేసుకోవాలని దీదీ అనుకుంటున్నారు. ఒకవేళ పీఎం పదవి వేలానికి వస్తే, తాము దోచుకున్న సంపదనంతా కూడదీసుకుని ఆ పదవి కోసం దీదీ, కాంగ్రెస్ పోటీ పడతారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. అయితే ప్రధాని పదవి కొనుగోలుకు లేదంటూ ఆయన చమత్కరించారు.
 
ఐఈడీ కంటే ఓటర్ ఐడీ బలమైనది…
కాగా, అంతకుముందు అహ్మదాబాద్‌లోని రనిప్‌లో ప్రధాని మోదీ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఐఈడీ కంటే ఓటర్ ఐడీ చాలా బలమైనదని అన్నారు. ఉగ్రవాదానికి బలం ఐఈడీ అయితే, ప్రజాస్వామ్యంలో ఓటర్ ఐడీ శక్తివంతమైనదని చెప్పారు. తన దృష్టిలో ఐఈడీ కంటే ఓటర్ ఐడీ మరింత పవర్‌ఫుల్ అని, ఓటర్ ఐడీల బలాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కుంభమేళా పవిత్ర స్నానంతో ఆయన పోల్చారు. కుంభమేళాలో స్నానం చేసి ప్రతి ఒక్కరూ పవిత్రమైనట్టే, ప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకుని అంతా పరిశుద్ధులు కావాలని మోదీ సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *