పీఎన్‌బీఎస్‌.. కూల్‌.. కూల్‌


  • బెజవాడ బస్‌స్టేషన్‌లో భారీ ఎయిర్‌ కూలర్లు
  • కూలర్ల వద్ద సేద తీరుతున్న ప్రయాణికులు
  • రోజుకు రెండు లక్షల మందికి చల్లని అనుభూతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకే ప్రధాన బస్‌జంక్షన్‌ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)లో చల్లటి గాలిని అందించే భారీ ఎయిర్‌ కూలర్లను రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ర్టాలైన తెలంగాణాలోని హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగ ల్‌ తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లకు ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులు నడుస్తున్నాయి. రోజూ పీఎన్‌బీఎస్‌కు సగటున రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా దూరప్రాంతాల ప్రయాణికుల అవసరాలను పీఎన్‌బీఎస్‌ తీర్చుతోంది. ఎండలు మండుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి గంటల తరబడి బస్సులలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బస్సులు ఉష్ణ ప్రభావానికి గురవుతుంటాయి.
 
ఇందులోని ప్రయాణికులు ఉడికిపోతుంటారు. ఏసీ బస్సులు అయితే ఫర్వాలేదు. పీఎన్‌బీఎస్‌లో చల్లటి గాలులతో ప్రయాణికులకు స్వాగతం చెప్పాలని ఆర్టీసీ భావించింది. ఈ నేపథ్యంలో బస్‌స్టేషన్‌లోని ప్రయాణికులు బస్సు దిగే చోట బ్లాక్‌(అరైవల్‌)లో భారీ సైజు ఎయిర్‌ కూలర్లను ఏర్పాటు చేసింది. దాదాపుగా ప్రతి ప్లాట్‌ఫామ్‌ వద్ద భారీ కూలర్లను ఏర్పాటు చేశారు. అరైవల్‌ బ్లాక్‌ మాత్రమే కాకుండా డిపార్చర్‌ బ్లాక్‌లో ఎయిర్‌కూలర్లను ఏర్పాటు చేశారు. అధికారులు బస్‌స్టేషన్‌లో కూలర్లను ఏర్పాటు చేయటంతో ప్రయాణికుల నుంచి అభినందనలు వస్తున్నాయి. గతంలో బస్సుల్లో కూడా ఎయిర్‌కూలర్లు ఏర్పాటు చేసేవారని, వాటిని కూడా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
 
ఎయిర్‌కూలర్ల వ్యవస్థను ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు రెండేళ్ల కిందటే పర్మినెంట్‌ వ్యవస్థగా తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం వీటికి మరమ్మతులు చేసి వేసవిలో ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి పీఎన్‌బీఎస్‌ను ఏసీ చేయాలని నిర్ణయించారు. ప్లాట్‌ఫామ్స్‌ ఓపెన్‌గా ఉంటాయి కాబట్టి చల్లదనం నిలవదని భావించిన ఆర్టీసీ అధికారులు భారీ ఎయిర్‌కూలర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిని పాతిక వరకు కొనుగోలు చేశారు. ఈ ఎయిర్‌ కూలర్లలోకి చల్లటి నీరు వెళ్తుంది. ఎయిర్‌ కూలర్లు అమర్చిన చోట నుంచి పైపుల మార్గాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. పీఎన్‌బీఎస్‌లోని టెర్రస్‌పై కూలింగ్‌ వాటర్‌ డిస్ర్టిబ్యూషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో కూలింగ్‌ వాటర్‌ను వదలగానే కూలర్లలోకి చేరిపోతాయి. ఇవి పనిచేస్తున్నంత సేపూ ప్లాట్‌ఫామ్‌లు చల్లగా ఉంటాయి.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *