పీహెచ్‌సీలపై ‘బయో’ భారం!


  • వ్యర్థాల నిర్వహణకు నెలకు 4వేలు ఖర్చు
  • బోధనాస్పత్రుల కంటే అత్యధిక రేటు
  • పడకకు రూ.13- 25 వరకూ చెల్లింపు
  • హెచ్‌డీఎస్‌ నిధుల్లో 48వేలు బీఎండబ్ల్యూకే
  • రీఫండ్‌పై స్పష్టత ఇవ్వని ఆరోగ్యశాఖ
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ నిర్ణయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భారమవుతున్నాయి. ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులకు… ఇక్కడ అవుతున్న ఖర్చులకు సంబంధమే ఉండటం లేదు. మందుల కొనుగోలుకు అవసరమైన నిధుల నుంచి అటెండర్లు, వాచ్‌మన్ల జీతాల వరకూ ప్రతిదీ పీహెచ్‌సీలపైనే పడుతోంది. ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న వీటిపై ఆరోగ్యశాఖ మరో భారం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో ‘బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌(బీఎండబ్ల్యూ)’ అమలు చేయాలని అదేశించింది. ఎయిడ్స్‌, ప్లేగు, క్షయ వ్యాధుల విస్తరణను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 2016లో నిర్ణయం తీసుకున్నాయి.
 
దీనిప్రకారం బీఎండబ్యూ నిర్వహణకు ఒక్కో పీహెచ్‌సీ రూ.4వేలు చొప్పున కాంట్రాక్టరుకు ప్రతినెలా చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.48వేలు వ్యర్థాల నిర్వహణకే పోవడం భారంగా మారింది. సీహెచ్‌సీలో 50పడకల కంటే తక్కువ ఉంటే ఒక్కోదానికి రోజుకు రూ.5 చొప్పున, అంతకంటే ఎక్కువుంటే రూ.6 చొప్పున బీఎండబ్ల్యూ కాంట్రాక్ట్‌ర్లకు చెల్లిస్తున్నారు. ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే విధమైన రేట్లు అమల్లో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో 400పడకల కంటే తక్కువ ఉంటే బెడ్‌కు రూ.6, ఆపైన బెడ్‌కు రూ.7 చొప్పున చెల్లిస్తున్నారు. పీహెచ్‌సీల విషయంలో మాత్రం ఈ రేట్లలో వ్యత్యాసం భారీగా ఉంది. ఇక్కడ పడకలతో సంబంధం లేకుండా నెలకు రూ.4వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.
 
దీంతో ఒక్కో పడకకు రూ.13నుంచి రూ.25వరకూ చెల్లించాల్సి వస్తోంది. ఇది తమకు అత్యంత భారంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో బీఎండబ్ల్యూ అమలులోకి వచ్చింది. మిగతా జిల్లాల్లో పీహెచ్‌సీలు, కాంట్రాక్ట్‌ సంస్థల మధ్య అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. చివరికి అగ్రిమెంట్‌ చార్జీలు కూడా పీహెచ్‌సీల నుంచే కాంట్రాక్ట్‌ సంస్థలు వసూళ్లు చేస్తున్నాయి. జూన్‌ నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వస్తుంది.
 
1.50లక్షల్లో… బీఎండబ్ల్యూకే 48వేలు
పీహెచ్‌సీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.50లక్షలు చొప్పున కేటాయిస్తుంది. ఈ నిధులతోనే నిర్వహణ కష్టంగా మారిన సమయంలో బీఎండబ్ల్యూకు ప్రతినెలా రూ.4వేలు చెల్లించడం మరింత భారంగా మారనుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది కాబట్టి పీహెచ్‌సీలు చెల్లించే మొత్తాన్ని ఆరోగ్యశాఖ తిరిగి అందించాలి. కానీ దీనిపై పీహెచ్‌సీలకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే హెచ్‌డీఎస్‌ కమిటీల నిర్వాకంతో చాలా పీహెచ్‌సీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రి నిధులను కొందరు కమిటీ సభ్యులు వారి సొంతానికి ఉపయోగించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి.
 
గతంలో ఇలా…
గతేడాది వరకూ పీహెచ్‌సీల నుంచి వచ్చే బయో మెడికల్‌ వ్యర్థాలను అక్కడే తవ్వి ఉంచిన ఒక పెద్ద గొయ్యిలో పడేసేవారు. నిండిన తర్వాత దాన్ని పూర్తిగా కప్పేసేవారు. దీనివల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకపోయినా చుట్టుపక్కల వారికి వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో కేంద్రం బీఎండబ్ల్యూను అమలులోకి తీసుకువచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించే మొత్తం అధికంగా ఉండటంతో కొంతమంది వైద్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో చెల్లిస్తున్నట్లుగా పడకల లెక్కన ధరను పరిమితం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఆరోగ్యశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *