పూడికతీత పూజ్యం


  • కాలువలకు మరమ్మతులు జరిగేనా?
  • పనులు చేస్తేనే చివరి భూముల వరకు సాగునీరు
  • ప్రతిపాదనలు, అనుమతులతోనే సరి
(ఆంధ్రజ్యోతి – మచిలీపట్నం) ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. రబీ సీజన్‌ కూడా ముగియనుంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగియడంతో జనవరిలోనే ప్రధాన కాలువలకు నీటి విడుదలను నిలిపివేశారు. ఏటా ప్రధాన కాలువలు, వాటి అనుబంధ కాలువలకు కనీస మరమ్మతులు చేస్తేనే శివారు భూములకు సాగునీరు సక్రమంగా చేరేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎన్నికలు రావడంతో అధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. సాగునీరు, మురుగు కాలువలకు సంబంధించిన మరమ్మతులు, పూడిక తీత తదితర పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం జరిగింది. ఈ ఏడాది ప్రధాన కాలువలకు కనీస మరమ్మతులు చేపడతారా, లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మే నెల సమీపిస్తున్న తరుణంలో పంట కాలువలు, డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపుడెక్క తొలగింపు కోసం రసాయనాలు పిచికారీ చేయాల్సి ఉంది. ఈ పనులైనా చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మార్చి నెలలో తాగునీటి అవసరాల కోసం కాలువలకు నీటిని విడుదల చేశారు. అవకాశం ఉంటే మళ్లీ మేలో తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా కాలువల్లో పేరుకుపోయిన తూటికాడ, గుర్రపు డెక్క నిర్మూలన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సాగునీటి సంఘాల ద్వారానే ఈ పనులు చేయాల్సి ఉంది. నీటి తీరువా వసూళ్ల ఆధారంగానే ఈ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో నీటి తీరువా వసూళ్లపై అంతగా దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. నీటి పారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతుల కోసం పంపితే, ఎప్పటికి అనుమతులు వస్తాయో, ఎప్పటికి పనులు చేస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
 
ప్రధాన కాలువల పనులెప్పుడో..
జిల్లాలో ఏలూరు, కేఈబీ, బందరు, రైవస్‌ కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కేఈబీ కాలువ పరిధిలో 1.25 లక్షల వరకు ఆయకట్టు ఉంది. ఈ కాలువ ఇరువైపులా గట్లు బలోపేతం చేయాల్సి ఉంది. కాలువలకు నీటిని విడుదల చేసినప్పుడు గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో గండ్లు పడి నీరు వృథాగా పోవడం ఆనవాయితీగా మారింది. యనమలకుదురు లాకుల నుంచి దివిసీమలోని కోడూరు, నాగాయలంక శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందాల్సి ఉంది. కోడూరు మండలంలోని మందపాకల, ఇరాలి, రామకృష్ణాపురం, నాగాయలంక మండలం సొర్లగొంది వరకు సాగునీరు వెళుతుంది. 2008లో డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టగా, ఈ పనులకు సంబంధించి కాలపరిమితి ముగిసిందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. దివిసీమలోని సాలెంపాలెం, ఇరాలి, గుల్లమోద, సంగమేశ్వరం తదితర ప్రాంతాల్లోని ప్రధాన డ్రెయిన్లు సముద్రంలో కలిసే చోట ఔట్‌ఫాల్‌ స్లూయిస్‌లు దెబ్బతిన్నాయి. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. బందరు కాలువ మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ కాలువ ఆయకట్టులో 1.10 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ కాలువలో పదేళ్లుగా పూర్తిస్థాయిలో పూడికతీయలేదు. దీంతో కాలువ గట్లు బలహీనంగా కనిపిస్తున్నాయి. బంటుమిల్లి కాలువకు మల్లేశ్వరం వరకు మట్టి పనులు చేశారు. మల్లేశ్వరం దిగువన లక్ష్మీపురం లాకుల వరకు పనులు చేసే అంశంపై అధికారులు పెదవి విప్పడం లేదు. జాతీయ రహదారి 216-ఏ విస్తరణలో భాగంగా ఓవైపున రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేశారు. రెండో గట్టుకు కనీస మరమ్మతులు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గంటసాల పరిసర ప్రాంతాల్లో గుండేరు డ్రెయిన్‌లో తూటికాడ, గుర్రపుడెక్క పేరుకుపోయింది. వీటి నిర్మూలన కోసం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
సాగునీటి సంఘాల ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో 120 సాగునీటి సంఘాలు ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో 301 పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఏలూరు, రైవస్‌ కాలువల్లో పూడికతీత, తూటికాడ, గుర్రపుడెక్క తొలగింపు, కాలువల నిర్వహణ తదితర పనులను రూ.11.73 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులైనా జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఏది ఏమైనా కాలువల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోతే శివారు ప్రాంతాల వరకు సాగునీరు చేరే అవకాశం కనిపించడం లేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *