పేదరికంపై సర్జికల్ దాడులు చేస్తాం: రాహుల్


సమష్టిపూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదరికంపై లక్షిత దాడులు జరుపుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బీహార్‌లోని సమష్టిపూర్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో పేదరికంపై సర్జికల్ దాడులు, న్యాయ్ స్కీమ్ అమలు తమ ఆయుధాలని చెప్పారు. ప్రధాని మోదీ గత ఐదేళ్లలో గబ్బర్ సింగ్ టాక్స్ (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దుతో పేదలపై దాడులు జరిపారని, ఇందుకు భిన్నంగా పేదరిక నిర్మూలనపై తమ పోరు ఉంటుందని తెలిపారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ వేదిక పంచుకున్నారు.
 
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబాన్ని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడాన్ని రాహుల్ తన ప్రసంగంలో తప్పుపట్టారు. ‘లాలూపై మోదీ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. తన తండ్రిని ఆసుపత్రిలో కలుసుకునేందుకు కూడా తేజస్వి యాదవ్‌ను అనుమతించలేదు. ఈ విషయాన్ని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ఎన్నటికీ మిమ్మల్ని (మోదీ) ప్రజలు క్షమించరు’ అని రాహుల్ విరుచుకుపడ్డారు.
 
కాగా, రాహుల్ ఎన్నికల ర్యాలీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇవాళ ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన బయలుదేరిన విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆయన ఢిల్లీకి వెనుదిరిగి వెళ్లారు. అక్కడ్నించి మరో విమానంలో ఆయన పాట్నాకు వచ్చారు. ఇంతవరకూ బీహార్‌లో మూడు విడతల ఎన్నికలు జరుగగా, తక్కిన నాలుగు విడతల ఎన్నికలు ఈనెల 29, మే 6,12,19 తేదీల్లో జరుగనున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *