పొంచి ఉన్న.. ఉపద్రవం!


  • సాగర్‌ నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి అత్యంత సమీపంలో…
  • ప్రస్తుతం 511.00 అడుగులు
  • 510 అడుగులకు చేరితే డెడ్‌స్టోరేజీ
  • మరోసారి చెరువులు నింపడం కష్టమే
  • ప్రశ్నార్థకంగా నీటి సరఫరా
మాచర్ల, మే 12: నాగార్జున సాగర్‌ నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయం 511.00 అడుగులు. రిజర్వాయర్‌ నీటి మట్టం 510 అడుగులకు చేరితే డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. వేసవి తీవ్రత వల్ల అడుగు నీటిమట్టం తగ్గడానికి ఎన్నోరోజులు కూడా పట్టదు. నిబంధనల ప్రకారం ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా డెడ్‌స్టోరేజీ లెవల్‌లో సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయకూడదు. ప్రస్తుతం ఉన్న 511 అడుగుల నీరు 133.37 టీఎంసీలకు సమానంగా చెప్పవచ్చు.
 
కుంటలు, చెరువులు నింపినా..
గతనెల 24వ తేదీన కుడికాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీనికి ముందే తాగునీటి అవసరాల కోసం అధికారులు సాగర్‌ కుడికాలువ పరిధిలోని రెండు జిల్లాల్లో నీటి కుంటలను, చెరువులను నింపేశారు. మాచర్ల సబ్‌ డివిజన్‌ పరిధిలో రెంటచింతల, గురజాల, మాచర్ల మండలాలకు చెంది 41 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల నీటిని స్టోరేజీ చేశారు. అయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు ఆవిరి రూపంలో చాలా నష్టపోవాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండడంతో పశు నీటి అవసరాలూ ఇక్కడ ఎక్కువే. దీంతో నిల్వ చేసిన నీరు జన, పశుపక్ష్యాదులకు చాలినంత స్థాయిలో లేవనే చెప్పాలి. ఇప్పటికే నిల్వ నీటిలో సగ భాగానికి పైగా వినియోగం జరిగిపోయింది. మరో 20రోజుల అవసరాలకు మించి నీరు వచ్చే అవకాశం లేదు. సకాలంలో వర్షాలు పడకుంటే పరిస్థితి ఏమిటా అని ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
 
ఇప్పటికే కోటాకు మించి..
తాగునీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులను అర్థం చేసుకున్న ప్రభుత్వం మరో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్‌ బోర్డును ఆశ్రయించింది. ఏప్రిల్‌ నెలలో నీటిని విడుదల చేసినప్పుడు కేటాయించిన కోటా పూర్తయిన దరిమిలా మళ్లీ నీటి విడుదల సాధ్యం కాదని కృష్ణా రివర్‌బోర్డు తెగేసి చెప్పింది. తెలంగాణ ప్రాంతానికి మరో 10 టీఎంసీల కేటాయింపు నీరు ఉందని, తమకు ఆ మిగిలిన మొత్తం విడుదల చేయమని అక్కడి అధికారులు కృష్ణా రివర్‌ బోర్డు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన ప్రాంతానికి నీటి విడుదల కష్టంగానే కనిపిస్తోంది.
 
రైతుల్లో ఆందోళన
ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయంలో నీరు అడుగంటడంతో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి జలాశయానికి నీటి విడుదల ఉంటుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాజెక్ట్‌ల్లో సైతం నీటినిల్వలు తగ్గిపోవడంతో సాగర్‌ ప్రాజెక్ట్‌కు నీటివిడుదల పూర్తిగా నిలిచిపోయింది. మొత్తానికి నాగార్జున సాగర్‌ కుడికాలువ పరిధిలో ఈ యేడాది తాగు, సాగు నీటి ఇక్కట్లు తప్పేలా లేవు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *