పోలింగ్‌ ముగిసిన తర్వాత టీడీపీ నేతల అభిప్రాయం మారిందట


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మొదటి దశలోనే నిర్వహించడం పట్ల అప్పట్లో కొంతమంది టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమను దెబ్బకొట్టడానికే ఒకే దశలో ఎన్నికల నిర్వహణ చేపట్టారంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. కానీ ఒకే విడతలో.. అది కూడా మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహించడంపై ఇప్పుడు విశాఖ టీడీపీ నేతలు ఖుషీఖుషీగా ఉన్నారు. వీరి ఆనందానికి కారణాలు ఏంటో తెలియాలంటే స్మార్ట్‌సిటీ వైపు ఓ లుక్‌ వేయాల్సిందే!
 
   మంచి పనిచేసే వారికి దేవుడే అండగా ఉంటాడని ఒక నానుడి. దుష్టబుద్ధితో కుట్రలు చేసేవారికి ఆ దైవమే తగిన శాస్తి చేస్తాడని పెద్దలు చెబుతుంటారు. కరెక్టుగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇదే జరిగిందని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్ రాకముందు కొంతమంది నేతలు మన రాష్ట్రంలో ఏప్రిల్ చివరిలో కానీ.. మే నెలలో కానీ ఎన్నికలు జరిగితే బాగుంటుందని అంచనా వేసుకున్నారు. అలా జరిగితే తెలుగుదేశం పార్టీకి లబ్ధిచేకూరడం ఖాయమంటూ ఊహాగానాలు కూడా చేశారు. అయితే మొదటి విడతలోనే ఏపీలో అన్ని అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం, పోలింగ్‌ జరిగిపోవడం వంటి పరిణామాలు పూర్తయ్యాయి. మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడంపై అప్పట్లో కొంతమంది టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తంచేశారు. అభ్యర్ధుల ఎంపికకు, ప్రచారం చేసుకోవడానికీ తగిన సమయం లేదని తెగ ఆందోళన చెందారు. అయినా చేసేది ఏమీలేక.. ఎన్నికలకి సిద్ధపడిపోయారు. ఇప్పుడు అందరి జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు విజేతలో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే!
 
   ఏపీలో పోలింగ్‌ ముగిసిన తర్వాత టీడీపీ నేతల అభిప్రాయం మాత్రం మారింది. తొలి విడతలో ఏపీలో పోలింగ్‌ నిర్వహించడంపై విశాఖకు చెందిన కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు ఖుషీఖుషీగా ఉన్నారు. “ఏమిటి కారణం?” అని వాకబుచేస్తే దీనికొక పెద్దకథే చెబుతున్నారు. ప్రసుత్తం విశాఖలో నీటిసమస్య తీవ్రంగా ఉంది. రెండు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. కొన్నిచోట్ల అయితే వారానికి రెండు, మూడు దఫాలే నీళ్లు వస్తున్నాయి. ఈ పరిణామంపై విశాఖ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని ప్రాంతాలకు వాటర్‌ట్యాంక్‌లతో సరఫరా చేస్తున్నా… నీళ్లకోసం అక్కడ పెద్దపెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. ఈ సమస్య వచ్చే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
 
    ఈ సమయంలో కనుక పోలింగ్ జరిగి ఉంటే.. కచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురై ఉండే వాళ్లమని టీడీపీ నేతలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. వాటర్ ట్యాంక్‌ల కోసం ప్రజలు డబ్బులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా కుళాయిల దగ్గర ప్రజలు కాపలాలు ఉంటున్నారు. తమ వీధికి ఎప్పుడు వాటర్‌ట్యాంక్ వస్తుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగిఉంటే.. ప్రజలు పోలింగ్‌ బూత్‌లకు వచ్చే పరిస్థితే ఉండేది కాదనీ, పైగా అధికారపార్టీ ఇన్నాళ్లు పాలనలో ఉండి నీటికోసం సరైన ప్రణాళికలు అమలుచేయలేదని విపక్ష నేతలు నిందించి ఉండేవారనీ తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.
 
   ఇదే జరిగి ఉంటే ప్రజలు తమ స్పందనను ఓటు రూపంలో ప్రయోగించి ఉండేవారనీ, అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉండేదనీ టీడీపీలో చర్చ సాగుతోంది. అందువల్ల మొదటి దశలోనే ఏపీలో పోలింగ్‌ నిర్వహించడం ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌ పెద్దలు తమ నెత్తిన పాలుపోశారని కొందరు తెలుగుదేశం పెద్దలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు పోలింగ్‌కి ముందు టీడీపీకి మరో అంశం కూడా కలిసొచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు- కుంకుమ, పెన్షన్ల పెంపు, సుఖీభవ పథకాల సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలలో పడ్డాయి. దీంతో ఏపీలో వాతావరణం తమ పార్టీకి సానుకూలంగా మారిపోయిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు. అంతా మన మంచికే అంటే ఇదేనేమో!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *