‘పోలీసు దొంగలు’ అరెస్టు


  • నిందితుల్లో మంగళగిరి ‘పోలీసు డిజాస్టర్‌’ ఆర్‌ఐ
  • 50 లక్షల నగదు రికవరీ
  • రైలు దోపిడీ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
నెల్లూరు (క్రైం) ఏప్రిల్‌ 29 : ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే డబ్బుపై అత్యాశతో దోపిడీకి స్కెచ్‌ వేశారు. అయితే.. ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే రైల్వే పోలీసులకు చిక్కారు. దీంతో వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి పంపారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను రైల్వే డీఎస్పీ వసంతకుమార్‌ సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు.
 
దీని ప్రకారం.. కావలి పట్టణంలోని పీఎంఆర్‌ సిల్వర్‌ ప్యాలెస్‌ యజమాని మల్లికార్జునరావు.. ఈ నెల 15న సురేఖ అనే మహిళకు రూ.50లక్షలు నగదు ఇచ్చి చెన్నైలో బంగారం కొని తీసుకురావాలని చెప్పాడు. అయితే ఆమె.. తాను ఒంటరిగా వెళ్లలేనని మరో మహిళ సాయం తీసుకుంటానని చెప్పింది. దీనికి యజమాని సరే అనడంతో అనిత అనే మహిళను చెన్నై తీసుకెళ్లేందుకు ఒప్పించింది. అదేరోజు వారిద్దరూ నగదు తీసుకుని కావలి రైల్వే స్టేషన్‌లో నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు గూడురు స్టేషన్‌కు చేరుతున్న సమయంలో.. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి, తనిఖీల పేరిట వారి బ్యాగులను తీసుకుని రైలు దిగి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పీఎంఆర్‌ సిల్వర్‌ ప్యాలెస్‌ యజమాని మల్లికార్జునరావు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
పోలీసుల దర్యాప్తులో ఈ దోపిడీకి పాల్పడింది మొత్తం ఆరుగురని తేలింది. ఆరుగురిలో నలుగురు పోలీసులుగా నిర్ధారించారు. ముందుగా ఈ నెల 26న మారి రవి, అనితలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20లక్షల నగదు రికవరీ చేశారు. సోమవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30లక్షల నగదును రికవరీ చేశారు. చెన్నైకు నగదు తీసుకెళుతున్న విషయాన్ని అనిత తన సన్నిహితుడు రవికి తెలపగా, రవి తన సమీప బంధువైన 9వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ మహే్‌షకు తెలిపాడు. మహేష్‌ తోటి ఉద్యోగులైన షేక్‌ సుల్తాన్‌ బాషా, ఒంటేరు సుమన్‌ కుమార్‌ సాయం తీసుకున్నారు. ఇలా ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు కలిసి పైఅధికారి అయిన మంగళగిరిలోని స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాండ్‌ ఫోర్సు కంపెనీలో ఆర్‌ఐగా పనిచేసే మల్లికార్జునరావును ఈ దోపిడీకి ఒప్పించారు.
 
పథకం ప్రకారం ఈ ఆరుగురూ కలిసి రైలులో సురేఖ నుంచి రూ.50లక్షల నగదును దోచేశారు. పోలీసు శాఖలో ఆర్‌ఐ స్థాయి అధికారే దొంగతనానికి ప్రోత్సహించడం, ముగ్గురు కానిస్టేబుళ్లు దొంగతనంలో కీలక పాత్ర వహించడం జిల్లాలో సంచలనంగా మారింది. సాధారణ దొంగలకంటే ఈ చోరీలో కీలక పాత్ర వహించిన పోలీసులను కఠినంగా శిక్షిస్తామని, ఇప్పటికే వీరిని ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేశామని డీఎస్పీ తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *