పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ


  • 22 ఉద్యోగాలకు 30,523 మంది దరఖాస్తు
  • నేడే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌ పరీక్ష
  • జిల్లాలో 65 కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వ ఉద్యోగాల్లో చిన్న పోస్టులకూ పోటీ భారీగానే ఉంటోంది. తక్కువ ఖాళీలకూ భారీ సంఖ్యలో దరఖాస్తులు పెడుతున్నారు. డబుల్‌ డిజిట్లో ఉద్యోగాలు విడుదలైనా ఐదంకెల్లో పోటీపడుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనా పరంగా కీలకమైన కార్యదర్శుల కొరత తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సమస్య పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ: పెండింగ్‌ (క్యారీడ్‌ ఫార్వార్డ్‌), ప్రస్తుత పోస్టులను కలిపి 22 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా నుంచి 30,523 మంది ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో 50పోస్టులకు 41,501 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి 72 పోస్టులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. కానిస్టేబుల్‌, కింది స్థాయి ఉద్యోగాలను సాధించిన వారూ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తులు చేశారు. గ్రూప్‌-1, 2 పరీక్షలకు సిద్ధమవుతోన్న అభ్యర్థులూ ఈ ఉద్యోగాలకు ట్రయల్స్‌ వేస్తున్నారు.
 
ఆగస్టులో మెయిన్స్‌
ఇరు జిల్లాల్లోని 72 పోస్టులకు 72,024 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సుమారు వెయ్యి మంది పోటీపడుతున్నారు. యావత్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఏర్పాటుచేసిన ఏపీపీఎస్సీ అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టులో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల ఏర్పాట్లు, సౌకర్యాలపై ఇరు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
తొమ్మిదిన్నరలోపే చేరుకోవాలి
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించడానికి ఇరు జిల్లా యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కృష్ణా జిల్లాలోని 65 పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ను నిర్వహించనున్నారు. తొమ్మిదన్నర లోపేఅభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఇదివరకే ప్రకటించారు. పరీక్ష నిర్వహణకు 27 మంది లైజన్‌ ఆఫీసర్లు, 67 మంది సహాయ లైజన్‌ ఆఫీసర్లతో పాటు 65 మంది చీఫ్‌ సూపరిండెంట్లను కృష్ణా జిల్లాలో నియమించారు. అభ్యర్థులు తమతో పాటు ఫొటో గుర్తింపు కలిగిన పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సుల్లో ఏదో ఒకటి తీసుకు వెళ్లాలి. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు, కాలిక్యులేటర్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *