ప్రగ్యా వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. యూటర్న్ తీసుకున్న సాధ్వి


న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల ఘటనలో అమరుడైన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై ఈసీ కన్నెర్ర చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఈసీ ఆదేశించింది. కాగా, తన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విమర్శలు, సొంత పార్టీ సైతం ఆమె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమంటూ పేర్కొనడంతో ప్రగ్యా యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తన మాటలను విపక్షాలు ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయంటూ తప్పుపట్టారు.
 
భోపాల్‌లో గురువారంనాడు మీడియాతో ప్రగ్యా సింగ్ మాట్లాడుతూ, ప్రజ్ఞాసింగ్ తనను వేధించారని, ఇందుకు శిక్ష తప్పదని తాను చెప్పానని, ఆ సమయం ఆ తర్వాతే రానే వచ్చిందని, నెలలోనే ఉగ్రవాదుల చేతిలో కర్కరే హతమయ్యారని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ఆమెపై విరుచుకుపడ్డాయి. అమరవీరుల పట్ల బీజేపీకి ఉన్న కపట ప్రేమకు ప్రగ్యా వ్యాఖ్యలే నిదర్శనమని విపక్షాలు తప్పుపట్టాయి. సైన్యం, అమరవీరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్న ఈసీ నిబంధనలను ప్రగ్యా ఉల్లంఘించారని భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ విమర్శించారు. వివాదం ముదురుతుండటంతో బీజేపీ అధిష్ఠానం ఓ ప్రకటనలో ప్రగ్యా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదంటూ ప్రకటించింది. కర్కరే కుటుంబానికి తాము అండగా నిలుస్తామని పేర్కొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *