ప్రగ్యా వ్యాఖ్యలు హుందాగా లేవు: కర్కరే కుమార్తె


న్యూఢిల్లీ: 26/11 పేలుళ్ల హీరో హేమంత్ కర్కరే‌పై బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కర్కరే కుమార్తె నవరే తొలిసారి స్పందించారు. సాధ్వి వ్యాఖ్యలు హుందాగా లేవన్నారు. తన తండ్రి హేమంత్ కర్కరే ఒక రోల్ మోడల్ అని, ఆయన పేరు ప్రస్తావించేటప్పుడు హుందాగా వ్యవహరించాలని మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కోరారు.
 
దేశమే అన్నింటికంటే ముఖ్యమని, అదే అందరి ప్రధాన బాధ్యత కావాలని తమ తండ్రి ఎప్పుడూ చెప్పేవారని, తన తండ్రి ప్రాణాలు విడిచే చివరి క్షణంలోనూ ముంబై నగరాన్ని, దేశాన్ని కాపాండేందుకు తపించారని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ఒంటికి వేసుకుని యూనిఫాంను ఎంతగానే ప్రేమించేవారని, అందుకోసం తన ప్రాణాలను పణంగా పెట్టారని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని తాను కోరుతున్నానని చెప్పారు. ఉగ్రవాదానికి మతం లేదని కూడా తమకు కర్కరే చెప్పేవారని నవరే తెలిపారు.
 
2018 ముంబై ఉగ్రదాడిలో యాంటీ టెర్రరిసిస్ట్ స్క్వాడ్ చీఫ్‌గా ఉన్న కర్కరే ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం, దేశాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేయడం, ఆయన చూపించిన సాహసానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘అశోక్ చక్ర’ అవార్డును ప్రదానం చేసింది. కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను కర్కరే వేధింపులకు గురిచేశారని, అందుకు ప్రతిఫలం తప్పదంటూ తాను శపించిన నెల రోజులకే కర్కరే ఉగ్రవాదుల చేతులో హతమయ్యారని సాధ్వి ప్రగ్యా సింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే.. అమరవీరులకు బీజేపీ ఇచ్చే గౌరవం ఏమిటో ప్రగ్యా వ్యాఖ్యలే చెబుతున్నాయంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడం, బీజేపీ సైతం ప్రగ్యా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని ప్రకటించడం, ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్ నోటీసులు పంపడంతో ప్రగ్యా వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *