ప్రతిష్టంభన!


  • ఎన్నికల కోడ్‌ సమయంలో స్టీరింగ్‌ కమిటీ సమావేశం
  • నేడు నగరానికి వస్తున్న ‘శిస్ర్టా’ బృందం
  • ఏఎంఆర్‌సీ అధికారులతో సమావేశం
  • కోడ్‌ కారణంగా స్టీరింగ్‌ కమిటీలో పాల్గొనలేని మంత్రి
లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విజయవాడ నగరంతో పాటు అమరావతి రాజధానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు . దీని భవితవ్యంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది! లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై సోమవారం అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ సమావేశం బెజవాడ నగరంలో జరగనుంది! సమావేశంలో కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్టీరింగ్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ కోడ్‌ కారణంగా సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు. ఇదే జరిగితే అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులే సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
విజయవాడ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన మేరకు విజయవాడ నగరానికి కేంద్రం మెట్రో రైల్‌ ప్రాజెక్టు హామీ ఇచ్చింది. విభజన చట్టంలో కూడా మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపింది. విభజన చట్టంలో నిర్దేశించిన ప్రాతిపదిక అయితే నూరు శాతం కేంద్ర సహాయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ప్రాతిపదికన అయితే 90 శాతం మేర, ప్రత్యేక ప్యాకేజీ ప్రాతిపదికన అయితే విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణం 60 శాతం ప్రాతిపదికన భరించేలా కేంద్రం తన సహాయ సహకారాలను అందించాల్సి ఉంటుంది. విజయవాడ మెట్రోకు మౌఖికంగా అనుమతులు ఇవ్వగా ప్రభుత్వం డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) చైర్మన్‌ శ్రీధరన్‌ను సలహాదారుగా నియమించుకుంది. అదే సంస్థ నేతృత్వంలో డీపీఆర్‌ తయారు చేయించింది. ప్రాజెక్టు బాధ్యతలను కూడా అదే సంస్థకు అప్పగించింది. టెండర్లు పిలిచిన సందర్భంలో కేవలం రెండు సంస్థలు భారీ రేట్లతో బిడ్డింగ్‌ వేయటంతో సిండికేట్‌ అయ్యాయన్న ఉద్దేశ్యంతో డీఎంఆర్‌సీ టెండర్లను రద్దు చేసింది. తిరిగి మళ్లీ టెండర్లకు సంకల్పించింది. అప్పటికింకా కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు రాలే దు.
 

లైట్‌ మెట్రోనే ఎంచుకోవడంతో..
విజయవాడకు మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వటానికి వాస్తవానికి విభజన చట్టం మేరకు, ఇచ్చిన హామీకి కట్టుబడి ఎలాంటి నిబంధనలను నిర్దేశించాల్సిన అవసరం లేదు. కానీ, అందరి మెట్రో ప్రాజెక్టుల మాదిరిగా విజయవాడను కూడా ఒకే గాటన కేంద్రం కట్టింది. విజయవాడకు అనుమతులే ఇవ్వకుండా నూతన మెట్రో పాలసీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మళ్ళీ టెండర్లు పిలిచి ఉంటే.. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం కూడా దిగిరాక తప్పేది కాదు. మౌఖికంగా అనుమతులు ఇవ్వటం, వెంకయ్యనాయుడు హామీ కారణంగా.. సాకారం కావటానికి అవకాశాలు ఉండేవి. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేసింది. మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అనేక అధ్యయనాల తర్వాత లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఎంచుకోవటం జరిగింది. లైట్‌ మెట్రో ప్రాజెకు డీపీఆర్‌ రూపకల్పనకు సంబంధించి గ్లోబల్‌ టెండర్లను పిలవగా శిస్ర్టా సంస్థ ఎంపికైంది. ఈ సంస్థ గత అర్థ సంవత్సర కాలంగా డీపీఆర్‌కు రూపకల్పన చేస్తూ ఎన్నికల ముందు ఫైనల్‌ డీపీఆర్‌ను అందజేసింది. ప్రిలిమినరీ డీపీఆర్‌ను గతంలో అందజేసినపుడు మార్పులు, చేర్పులను అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో, దానికనుగుణంగా ఫైనల్‌ డీపీఆర్‌లో మార్పులు చేర్పులు చేయటం జరిగింది. గతంలో మెట్రో ప్రాజెక్టు 27 కిలోమీటర్ల కారిడార్‌ కాగా ప్రస్తుత లైట్‌ మెట్రోను 80 కిలోమీటర్ల కారిడార్‌గా నిర్దేశించారు.
 
మూడో కారిడార్‌ ప్రతిపాదన
బందరు రోడ్డు, ఏలూరు రోడ్డుతో పాటు జక్కంపూడికి మూడవ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఏలూరు రోడ్డు కారిడార్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అమరావతి రాజధానిలోని లింగాయపాలెం వరకు పొడిగించారు. ఎయిర్‌పోర్టు దగ్గర, రాజధానిలో పూర్తిగా అండర్‌ గ్రౌండ్‌ విధానంలోనూ, మిగిలిన చోట్ల పూర్తిగా ఎలివేటెడ్‌ (ఫ్లై ఓవర్‌) విధానంలోనూ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును మొత్తం రెండు, మూడు దశలలో విస్తరించటానికి ప్రతిపాదించారు. మొత్తంగా ప్రాజెక్టును 20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. గత మెట్రో ప్రాజెక్టుకు రెండు రెట్ల వ్యయం పెరుగుతుంది. ఫైనల్‌ డీపీఆర్‌ నేపథ్యంలో, స్టీరింగ్‌ కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. లైట్‌ మెట్రో ప్రాజెక్టును ఏ పద్దతిలో చేపట్టాలన్న దానిపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలా? పూర్తిగా ప్రైవేటుకు అప్పగించాలా? ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళాలా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. ఇన్నోవేటివ్‌ పీపీపీ విధానంలో అయితే ప్రభుత్వం సివిల్‌ నిర్మాణాలు చేపడితే.. ఆపరేషన్స్‌ అంతా ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే స్టీరింగ్‌ కమిటీలో చర్చ జరగాలి. స్టీరింగ్‌ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి తెలియ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దానిపై ఒక ప్రకటన చేస్తుంది. క్యాబినెట్‌ మంత్రి చైర్మన్‌గా ఉండటం వల్ల ఆయన తీసుకునే నిర్ణయం ప్రభుత్వ అభిమతానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం కోడ్‌ వల్ల మంత్రి హాజరు కాలేకపోతే అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల సోమవారం జరిగే సమావేశం కేవలం ఒక లాంఛనమే తప్ప లైట్‌ మెట్రో భవితవ్యాన్ని నిర్దేశించే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం కొలువు తీరటానికి మరో నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు భవితవ్యం తేలే అవకాశాలు లేవు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *