ప్రతి రైతు పశుసంపదతో పరిఢవిల్లాలి


  • వ్యవసాయంలో నష్టాలను అధిగమించాలి
  • వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి
తిరుపతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరిశీలిస్తే, వారికి పశుసంపద లేదని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే ప్రతి రైతు పశు సంపదతో పరిఢవిల్లాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిలషించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవంలో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన 325 మందికి డిగ్రీ పట్టాలు, ప్రతిభ కనబర్చినవారికి పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ రైతులు పశుసంపద పెంచుకోవాలని, ఇందులో వెటర్నరీ విద్యార్థులూ పాత్ర వహించాలని సూచించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ గొర్రెలు పెంచి లాభాలార్జించానని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. రైతు పండించే పంటకు రైతే ధర నిర్ణయించే రోజులు రావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా రైతు పాలసీని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా పరిశోధనలు ఉపయోగపడాలని విద్యార్థులకు సూచించారు.
 
నేడు ఒంగోలు గిత్తను బ్రెజిల్‌ దేశంలో ప్రోత్సహిస్తున్నా, మన దగ్గర కనిపించడంలేదన్నారు. వెటర్నరీ విద్యార్థులు, సైంటిస్టులు రైతన్నలకు సాంకేతికతను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నారు. పరాయి పాలనలో సంపద, విజ్ఞానం పోగొట్టుకున్నామని వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే మార్పు రావాలని, స్నాతకోత్సవంలో విద్యార్థులు పాశ్చాత్య గౌన్లు ధరించడం మానుకుని, సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. పాశ్చాత్య పరిపాలన నుంచి మనం బయటకు వచ్చి అన్నిరంగాల్లో మార్పు తీసుకురావాలన్నారు. ‘యోగాను మోదీ కోసం వద్దు.. మన బాడీ కోసం చేయాలి. టీవీలు, ఫోన్లకు బానిస కావద్దు’ అని విద్యార్థులకు హితబోధ చేశారు. వర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ మారుతున్న పోకడలు బట్టి కొత్త ఔషధాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. మొబైల్‌ క్లినిక్‌లు ఏర్పాటు కావాలన్నారు. వీసీ డాక్టర్‌ వై.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *