ప్రతి రోజూ.. ప్రత్యేకం..


  • హైదరాబాద్‌ , వైజాగ్‌, రాజమండ్రి, రాయలసీమ రూట్లలో స్పెషల్స్‌
  • సీజన్‌, అన్‌ సీజన్‌లోనూ రోజూ 10 స్పెషల్స్‌ నడపాల్సిన పరిస్థితి
  • వారాంతాల్లో 50 నుంచి 90 వరకు ఫ ఆర్టీసీకి లాభాలొచ్చే అవకాశం
  • హైకోర్టు, రాజధాని కార్యకలాపాల నిమిత్తం భారీగా రాకపోకలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి: ఇంతకు ముందు వరకు వారాంతాల్లో ‘ఆర్టీసీ’ స్పెషల్‌ బస్సులు నడిపేది. ప్రస్తుతం రోజూ స్పెషల్‌ బస్సులు న డపాల్సి రావడంతో పాటు, వారాంతాల్లో అసాధారణంగా స్పెషల్‌ బస్సులను నడపాల్సి వస్తోంది. విజయవాడకు పొరుగు రాష్ట్రం హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, రాయలసీమ రూట్లకు ప్రతి రోజూ స్పెషల్‌ బస్సులను నడపాల్సి వస్తోంది. రోజుకు పదికి తక్కువ కాకుండా స్పెషల్‌ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు 5 బస్సులు రాకపోకలు సాగిస్తుంటే విశాఖపట్నం వైపు 2, రాజమండ్రి వైపు 1, రాయలసీమకు 2 చొప్పున స్పెషల్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) నుంచి రోజూ దూర ప్రాంతాలకు అధిక సంఖ్యలోనే స్పెషల్‌ బస్సులు నడుస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌కే 123కు పైగా షెడ్యూల్‌ బస్సులు ఉన్నాయి. విశాఖకు 15, రాజమండ్రి వైపు 20, రాయలసీమ వైపు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున షెడ్యూల్‌ బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) నుంచి వెళ్తుంటాయి. ఇవి కాకుండా ఇతర జిల్లాల డిపోల నుంచి పీఎన్‌బీఎస్‌ను టచ్‌ చేస్తూ ఆయా దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆర్టీసీకి అన్‌ సీజన్‌ (స్లాక్‌ పీరియడ్‌ ) నడుస్తోంది. అయినా పైన చెప్పుకున్న రూట్లలో మాత్రం రాకపోకలు జరుగుతున్నాయి.
 
విశాఖ వైపు దృష్టి
విజయవాడ నుంచే రాకపోకలు జరుగుతుండటాన్ని బట్టి చూస్తే.. కచ్చితంగా వీరంతా రాజధాని ప్రాంతంలో వివిధ పనుల మీదనే వస్తున్నారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పీఎన్‌బీఎస్‌కు చేరుకుంటే రాజధాని ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి విజయవాడతో సమానంగా తెలంగాణ నుంచి బస్సుల రాకపోకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ స్థిరపడిన వారు పనుల నిమిత్తం రాజధాని ప్రాంతానికి వస్తున్నారు. వీరంతా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులనే ఆదరిస్తున్నారు. దీంతో షెడ్యూల్‌ బస్సులు అందుబాటులో లేకపోతే ఆర్‌టీసీ అధికారులు స్పెషల్‌ బస్సులను నడపాల్సి వస్తోంది. హైదరాబాద్‌కు రోజూ 5 స్పెషల్‌ బస్సులు నడపటం మామూలు విషయం కాదు. ఇక విశాఖపట్నం రెండో ప్రధాన రూటు. ఈ రూటు విషయంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఈ రూటు పూర్తిగా ప్రైవేటు ఆపరేటర్ల గుత్తాధిపత్యం కిందనే ఉంది. ఇటీవల ఆర్టీసీ అధికారులు విశాఖపట్నం రూట్‌పై దృష్టి సారించారు. కొత్త బస్సులను ఈ రూట్‌లో నిదానంగా ప్రవేశపెడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లకు పోటీ ఇవ్వడానికి ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి రాకపోకలు పెరగడంతో ఆర్టీసీ అధికారులు స్పెషల్‌ బస్సులను నడపాల్సి వస్తోంది.
 
రాయలసీమను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఆర్టీసీకి పెట్టని కోటగా రాయలసీమ ప్రాంతం ఉండబోతోంది. రాయలసీమ ప్రాంతానికి నేరుగా రైల్వే అనుసంధానత చాలా తక్కువగా ఉంది. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రోడ్డు రవాణా మీదనే ఆధారపడుతున్నారు. ఇటీవల విజయవాడకు రాయలసీమ నుంచి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. రాజమండ్రి రూట్‌లో ఎప్పుడూ ఆర్టీసీకి ఆదరణ ఉంటుంది. కొంతకాలంగా స్పెషల్‌ బస్సులు వేసే విధంగా రద్దీ నెలకొంటోంది.
 
వారితోనే ‘ఆర్టీసీ’ కళకళ
సొంత పనుల కోసం రాజధాని ప్రాంతానికి వస్తుండటంతో ప్రత్యేక బస్సులు నడపాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ పనుల నిమిత్తం రాకపోకలు సాగించే వారితో గతం కంటే భిన్నంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ మార్పును ఆర్టీసీ అధికారులు ముందుగా గుర్తించి బహిర్గతం చేశారు. ప్రస్తుతం హైకోర్టు కొలువు తీరింది. హైకోర్టు కార్యకలాపాలు రాజధాని నుంచే జరుగుతున్నాయి. దీంతో వివిధ కేసుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విశాఖ రూట్‌ బస్సులపైనా, రాయలసీమ ప్రాంతం నుంచి ఆ రూట్‌ బస్సులపైనా ప్రభావం కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో 10 ప్రత్యేక బస్సులు నడపటం ఒక ఎత్తు అయితే వారాంతాల్లో 90 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతుండటం విశేషం. గతంలో వారాంతాల్లో 10 నుంచి 20 వరకు వెళితే గొప్ప. అది కూడా డిమాండ్‌ ఉన్న రోజుల్లోనే నెలకొనేది. ప్రస్తుతం 90 వరకు స్పెషల్‌ బస్సులు నడపుతున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలనంతరం పూర్తి స్థాయిలో అటు సచివాలయం కానీ, ఇటు హైకోర్టు కానీ సోమవారం పని చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరానికి వచ్చే వారు కూడా ఎక్కువగా వారాంతాల్లోనే ప్రయాణం చేస్తుండటం గమనార్హం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *