ప్రధానిగా రాహుల్‌కు మద్దతిస్తా


  • ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తే ఒప్పుకుంటా: కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, మే 8: దేశ రాజధాని ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇస్తే.. ప్రధానిగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సంపూర్ణ మద్దతిస్తానని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దీనిపైనే ప్రధానంగా ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌.. మరో అడుగు ముందుకేసి ప్రధానిగా రాహుల్‌కు మద్దతు తెలిపారు. ఓ వార్తా సంస్థకు బుధవారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే ఎవరికైనా మద్దతిస్తానని అన్నారు. ప్రధాని పదవికి రాహుల్‌తో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ కూడా సరిగ్గా సరిపోతారని ఆయన సూచించారు.
 
ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్‌ గాంధీ ప్రేమ కురిపిస్తారేమోగాని తాను మాత్రం మోదీని ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటానని చెప్పారు. రాజ్యాంగంతో ఆడుకునే వారిని, మూకదాడులు, హత్యలు చేయించే వారిని తాను ఎన్నడూ ఇష్టపడనన్నారు. మరొకచోట విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ కోసం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎందుకు ప్రకటనలు విడుదల చేస్తున్నారని, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *