ప్రయాణికులకు.. చోటేదీ?


  • సరకు రవాణాకు అడ్డాగా ప్లాట్‌ఫారాలు
  • ప్రయాణికుల మధ్యనే సరకుమూటలు
  • తోపుడు బళ్లపై బల్క్‌గా దిగుమతి
  • స్టేషన్‌లో గూడ్స్‌ రైళ్లకు ఎనిమిది ప్రత్యేక లైన్లు
  • వీటివల్ల సాధారణ రైళ్లు ఔటర్‌లో నిలిచిపోయే పరిస్థితి!
సరకు రవాణాలో రికార్డుస్థాయిలో ఆదాయం సాధిస్తున్న విజయవాడ రైల్వే డివిజన్‌కు ప్రయాణికులను పక్కకునెడుతోంది! ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సిన స్టేషన్‌ను సరకు రవాణా కేంద్రంగా మార్చే స్తున్నారన్న ఆరోపణలను బెజవాడ డివిజన్‌ మూటకట్టుకుంటోంది. వచ్చీపోయే ప్రయా ణికులతో కళకళలాడాల్సిన ప్లాట్‌ఫామ్‌లు పార్శిల్‌ మూటలతో దర్శనమిస్తున్నాయి. దేశంలోనే స్వచ్ఛ స్టేషన్‌గా నాల్గవ స్థానం లోను, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) నుంచి గోల్డ్‌ రేటింగ్‌ అవార్డు అందుకున్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే అంశాలు కూడా ఉన్నాయి.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ రైల్వేస్టేషన్‌ దేశంలో ఏ-1 స్టేషన్లలో ఒకటి. రోజుకు సగటున రెండు లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లతో దేశంలో రెండో పెద్ద జంక్షన్‌గా ఉంది. స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అధికారులు కల్పించారు. అయితే ప్రస్తుతం సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వేలోనే సికింద్రాబాద్‌ డివిజన్‌ను కూడా దాటి విజయవాడ డివిజన్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యుత్తమస్థానాన్ని సాధించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 33.76 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేశారు. దీంతో విజయవాడ డివిజన్‌పై అంచనాలు పెరిగాయి. ఈ అంచనా ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోంది. రైల్వేలో సరకు, ప్రయాణికుల రవాణా రెండు విభాగాలు ఉంటాయి. ఆదాయం వస్తుంది కదా అని ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు స్టేషన్లలో అంతరాయం కలిగిస్తే ఇమేజీ పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌లను సరకు పార్శిళ్లతో నింపేయటం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తోపుడు బళ్లపై సరుకు మూటలను తరలిస్తూ ప్లాట్‌ ఫామ్‌లను నింపేస్తున్నారు.
 
ప్లాట్‌ ఫారాలపైనే సరుకు లావాదేవీలు?
స్టేషన్‌ దక్షిణం వైపున దూరంగా పార్శిల్‌ ఆఫీసు ఉంది. ఇక్కడి నుంచి ఆయా రూట్‌లలో నిర్ణీత ప్రాంతాలకు సరకును పంపిస్తారు. పెద్ద పెద్ద వ్యాపారులు బల్క్‌గా తీసుకు వచ్చే పార్శిల్స్‌ను రవాణా చేయటానికి వీలుగా ప్రత్యేక కోచ్‌లు మాట్లాడుకుంటారు. పార్శిల్‌ ఆఫీసుకు వచ్చే కోచ్‌లో వీటిని సర్దుతారు. ఇలాంటి కోచ్‌లను ఏ రూట్‌లో వెళ్లాలో ఆ రూట్‌లో వెళ్లే రైళ్లకు తగిలిస్తారు. పార్శిల్స్‌ను తీసుకు వెళ్లటానికి ప్రత్యేకంగా రవాణా వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పార్శిల్‌ ఆఫీసు వద్దనే జరగాలి. కానీ పార్శిల్‌ ఆఫీసులో ఉండాల్సిన సరకు మూటలు, స్టేషన్‌లోకి తీసుకురావటం ఇబ్బందికరంగా మారుతోంది.
 
ఇటీవలికాలంలో సాధారణ రైళ్లలో ఒకటి రెండు బోగీలు చేర్చి సరకు రవాణా చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే సరకు మూటలు నేరుగా స్టేషన్‌కు వస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. జనరల్‌ బోగీలను కుదించేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉంటున్నాయి. జనరల్‌ బోగీలను కుదించటం చూస్తుంటే అలా కుదించిన వాటి స్థానంలో సరకు రవాణా బోగీలను తగిలిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
బల్క్‌ రవాణాకు స్టేషన్‌లో గూడ్స్‌ లైన్లు
భారీఎత్తున వివిధ రాష్ర్టాలకు సరకు రవాణా చేయటానికి వీలుగా స్టేషన్‌లో గూడ్స్‌ రైళ్లకు ప్రత్యేకంగా లైన్లు ఉన్నాయి. ఇవి ప్రధాన స్టేషన్‌ కాకుండా పాత స్టేషన్‌ వెనుక భాగంలో ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 8-10ల మధ్యన గూడ్స్‌ కోసం ప్రత్యేకంగా 8 రైల్వేలైన్ల వ్యవస్థ ఉంది. బొగ్గు, వాహనాలు, కార్గో రవాణా అంతా ఇక్కడి గూడ్స్‌ రైళ్ల నుంచే బయలుదేరుతుంది. గూడ్స్‌ రైళ్లు నిరంతరం ఇక్కడ ఆగి ఉంటాయి కాబట్టి అదనంగా ప్రయాణికులకు మరికొన్ని లైన్లు వేసి సాధారణ ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపి ఉంచటానికి అవకాశం లేకుండా పోతోంది. దీంతో బెజవాడ రైల్వేస్టేషన్‌పై రద్దీ విపరీతంగా ఉంటోంది. రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వస్తోంది. ఔటర్‌లో రైళ్లను నిలుపుదల చేయాల్సి వస్తోంది. ఔటర్‌లో రైళ్లను నిలిపివేయటం వల్ల తీవ్ర ఆలస్యంగా నడుస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *