ప్రళయ.. ఫణి


  • ప్రచండ గాలులతో పూరీ వద్ద తీరం దాటిన పెను తుఫాను
  • బెంగాల్‌వైపు కదిలి బలహీనం.. తీరం దాటుతూ తీవ్ర ప్రతాపం
  • ఒడిసాలో ముగ్గురు దుర్మరణం.. పూరీపై విరుచుకుపడిన ఫణి
  • కూలిన వేల స్తంభాలు, చెట్లు.. మూగబోయిన మొబైల్‌ సేవలు
  • గాలుల తీవ్రతకు భువనేశ్వర్‌లో ఎగిరిన ఎయిమ్స్‌ పైకప్పు
భువనేశ్వర్‌, కోల్‌కతా, మే 3 : పడగెత్తిన రాక్షస అలలు, ఘీంకరించిన మృత్యుగాలులు, ముంచెత్తిన కుండపోత వర్షాలతో ‘ఫణి’..విరుచుకుపడింది. చండ ప్రచండంగా ఒడిసాను తాకి, పశ్చిమ బెంగాల్‌ వైపుగా కదిలింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో పూరీకి దక్షిణంగా బలుగాం, రంభ సమీపంలో పెను తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు గంటకు 205 కిలోమీటర్ల వేగంతో గాలులు ఈడ్చికొట్టాయి.
 
పదిరోజులకుపైగా సముద్రంలో సుడులు తిరిగిన ‘ఫణి’, తీరం దాటుతూ.. తీవ్ర ప్రతాపం చూపించింది. పూరీ సహా పలు జిల్లాలు, నగరాల్లో అది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తీరం వెంబడి ఉన్న పట్టణాలు, పల్లెలపై చెలరేగిపోయింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయారు. పూరీలో ఎటు చూసినా ఫణి ప్రళయ దృశ్యాలే కనిపించాయి. గాలుల తీవ్రతకు హోర్డింగులు, సెల్‌ టవర్లు, రోడ్డుపక్కన నిలిపిన క్రేన్‌లు చిరు కొమ్మల్లా ఊగిపోయి, నేలకూలాయి. వేలాది కరెంటు స్తంభాలు, చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. రోడ్డు పక్కన నిలిపిన బస్సులు, కార్లు గాలులకు కొట్టుకుపోయాయి. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రి పై కప్పు గాలిపటంలా లేచిపోయింది. నగరంలో భారీ వృక్షాలు కూలిపోయాయి. అవి టెలిఫోన్‌ కేబుల్స్‌పై పడటంతో టెలీకమ్యూనికేషన్‌, మొబైల్‌ సేవలు దాదాపుగా స్తంభించిపోయాయి. చెట్టు మీదపడి ఓ కుర్రాడు పూరీలో చనిపోయాడు. ఈదురుగాలులకు ఎగిరొచ్చిన ఇంటి రేకులు, ఇతర వస్తువులు తగిలి నయాగఢ్‌లో ఓ మహిళ మృతిచెందింది.
 
ఇంత తరలింపు ఇదే తొలిసారి
తుఫాను సహాయక చర్యలను ముందస్తుగా చేపట్టడం, ఇప్పటికే 11 లక్షలమందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం, వారిని నాలుగువేల సహాయక శిబిరాలకు, 880 తుఫాను ప్రత్యేక కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టాన్ని మాత్రం భారీగా అరికట్టగలిగారు. కేవలం రెండురోజుల వ్యవధిలోనే 11 జిల్లాల పరిధిలోని 10 వేల గ్రామాలు, 52 లోతట్టు పట్టణ ప్రాంతాలను ఖాళీ చేయించడం దేశ తుఫాన్ల చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. కాగా, ఒడిసాలో తీరం దాటే సమయంలో 28 కిలోమీటర్ల వెడల్పు, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పెను తుఫాను ముందుకు కదిలినట్టు ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ సేథీ వెల్లడించారు. ఖుర్దా, కటక్‌, జాజ్‌పూర్‌, భద్రక్‌, బాలాసోర్‌ మీదుగా పశ్చిమబెంగాల్‌ వైపు అది కదులుతున్నదని వెల్లడించారు. పెను తుఫాన్‌ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆకాశం ముసురుపట్టింది.
 
బలహీనం.. అయినా అప్రమత్తం
ఒడిసా వద్ద తీరం దాటిన పెను తుఫాను.. ఆ తరువాత కొన్ని గంటల్లోనే బలహీనపడిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే, తన ప్రభావాన్ని ఇంకా అది పూర్తిగా కోల్పోలేదని ఈ శాఖ అనుబంధ జాతీయ అత్యవసర సేవల విభాగం స్పష్టం చేసింది. ఒడిసాను 8 గంటలకు తాకిన తుఫాను, ఉదయం పది గంటలకు బలహీనపడిందని వివరించింది. అది శనివారం ఉదయానికి బెంగాల్‌ తీరం తాకుతుందని చెప్పారు. అయితే, పెనుతుఫాను తీవ్రత తగ్గుముఖం పట్టినా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఈశాన్యంలోని కొన్ని రాష్ర్టాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *