ప్రియాంక గాంధీ, మమతలపై సుష్మా స్వరాజ్ ఫైర్


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి మద్దతుగా విపక్షాలతో పోరాడేందుకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగారు. మోదీపై పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీలపై ఆమె ఇవాళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
మోదీ దుర్యోధనుడిలాంటి అహంకారి అంటూ ప్రియాంక వ్యాఖ్యానించడంపై సుష్మా ట్విటర్లో స్పందిస్తూ… ‘‘ప్రియాంకా, మీరు అత్యంత అహంకార ధోరణితో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనను రాహుల్ గాంధీ అవమానించిన తీరు ఆయన అహంకారానికి పరాకాష్ఠ. రాష్ట్రపతి ధ్రువీకరించిన ఆర్డినెన్స్‌నే రాహుల్ చించేశారు. దూషణ పర్వం సాగిస్తున్నది ఎవరు?’’ అని సుష్మా ప్రశ్నించారు.
 
కాగా ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుందో మోదీకి రుచి చూపిస్తామంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపైనా సుష్మా తనదైన శైలిలో స్పందించారు. ‘‘మమతా.. మీరు ఇవాళ పరిధి దాటి మాట్లాడారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, మోదీ దేశానికి ప్రధానమంత్రి. మీరు రేపు ఆయనతో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే మీకు బషీర్ బాదర్ రాసిన ఓ పద్యాన్ని గర్తుచేయాలనుకుంటున్నా: ప్రత్యర్థిని అంచనా వేయండి. కానీ పరిధి దాటకండి. మళ్లీ మనం స్నేహితులగా మారాల్సి వస్తే సిగ్గుపడకూడదు..’’ అని ఆమె ట్వీట్ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *