ఫణి తుపాన్ నేపథ్యంలో 223 రైళ్లు రద్దు


న్యూఢిల్లీ : ఫణి తుపాన్ నేపథ్యంలో ఒడిశా, కోల్‌కతా, చెన్నై సముద్రతీరంలోని ప్రాంతాల్లో 223 రైళ్ల రాకపోకలను రద్దు చేశామని రైల్వే అధికారులు శుక్రవారం చెప్పారు. 140 ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు 83 ప్యాసింజరు రైళ్లను ముందుజాగ్రత్తగా రద్దు చేశారు. ఒడిశా తీరంలోని భాద్రక్-విజయనగరం, కోల్‌కతా- చెన్నై రైలు మార్గాల్లో మే 4వతేదీ వరకు అన్ని రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు. మరో 9 రైళ్లను దారి మళ్లించారు.
 
ఫుల్ చార్జీ తిరిగి ఇస్తున్నాం…
తుపాన్ వల్ల పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసిన దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ తేదీ నుంచి మూడురోజుల్లోగా టికెట్లను రద్దు చేయించుకుంటే వారికి పూర్తిగా టికెట్ సొమ్ము వాపసు ఇస్తున్నామని రైల్వే అధికారులు చెప్పారు. హౌరా-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, పాట్నా -ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్, హౌరా -హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్- రామేశ్వరం ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ -పూరినందన్ కానన్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ- పూరి పురుషోత్తం ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. పర్యాటక ప్రదేశమైన పూరి పట్టణంలో నిలిచిపోయిన పర్యాటకులను హౌరాకు తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రైల్వేశాఖ తమ ఉద్యోగుల సెలవులను రద్దు చేసి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లతోపాటు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *