ఫణి వెడలె.. వేసవి హడలె


  • తుఫాను రాష్ట్రం దాటగానే ఒక్కసారిగా పెరిగిన ఎండ
  • మొదలయిన వడగాడ్పులు
  • కోస్తా, సీమల్లో తీవ్ర సెగలు
  • ఉదయం నుంచే ఉక్కపోత
  • ఈ సీజన్‌లోనే అత్యధికంగా ప్రకాశంలో 45.79 డిగ్రీలు
  • మరో 3రోజులు ఇవే గాడ్పులు
అమరావతి, విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): ‘ఫణి’ ప్రభావంతో ఉత్తరాంధ్ర కొద్దిగా వణికి, ఆనక చల్లబడగా, అదే తుఫాను కారణంగా రాయలసీమ, కోస్తాంధ్రలు మండాయి. శుక్రవారం పశ్చిమగోదావరి నుంచి అనంతపురం వరకు వేసవి సెగలు కక్కింది. ఈ ఏడాది ఇప్పటివరకూ చూడని వడగాలులు తుఫానుతో ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా గుడ్లూరులో అత్యధికంగా 45.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో తొలిసారిగా కావలిలో 44.6 డిగ్రీలు నమోదైంది. ఆ తరువాత ఇదే అత్యధిక పగటి ఉష్ణోగ్రత. తుఫాన్‌ దిశగా గాలులు వీయడంతో మధ్య భారతం మీదుగా వచ్చే పొడి గాలులతో కోస్తా వేడెక్కింది. ఉదయం నుంచి ఎండ పెరగడం, ఆ తరువాత వడగాడ్పులు వీయడంతో ప్రజలు సొమ్మసిల్లిపోయారు. సాయంత్రమైనా వాతావరణం చల్లబడలేదు. నేలపై అడుగేస్తే కాలు చుర్రుమనిపించేలా సెగలు వచ్చాయి.
 
దీనికితోడు గాలిలో తేమ శాతం ఒక్కసారిగా పడిపోయింది. తేమశాతం విజయవాడలో 22, కావలిలో 25, ఒంగోలులో 27, జంగమహేశ్వరపురంలో 39, నెల్లూరులో 44, బాపట్లలో 49 నమోదైంది. పడమర దిశ నుంచి కోస్తాపైకి పొడిగాలులు వీయడంతో కాకినాడ నుంచి నెల్లూరు వరకు అనేకచోట్ల ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికే వెనుకంజ వేశారు. మధ్యాహ్న సమయంలో అయితే అనేకచోట్ల ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలులో 43.7, జంగమహేశ్వరపురంలో 43.5, మచిలీపట్నంలో 43.1, బాపట్లలో 43, నెల్లూరులో 42.3, నందిగామలో 42.1, విజయవాడలో 41.9, కాకినాడలో 41.8 డిగ్రీలు నమోదైంది.
 
తీరం దాటడంతో గాడ్పులు..
ఫణి పెనుతుఫాన్‌ ఒడిసాలో తీరం దాడటంతో.. కోస్తాలో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు నిలిచిపోయాయి. తుఫాన్‌ ఉత్తర ఈశాన్యంగా పయనించడంతో పడమర దిశ నుంచి గాలులు మధ్యభారతం మీదుగా కోస్తా వరకు వీచాయి. మే నెలలో కోస్తాలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కోస్తా వైపు రావడంతో పడమర దిశ నుంచి వచ్చే గాలులు కొద్దిరోజులు నిలిచిపోయాయి. తుఫాను తీరానికి సమీపంగా వచ్చే సమయంలో కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసి, వాతావరణం కొంతవరకు చల్లబడింది. తుఫాను క్రమేపీ ఒడిసా వైపు పయనించడంతో కోస్తాలో తేమ తగ్గడం, మేఘాలు లేకపోవడం, ఇదే సమయంలో మధ్యభారతం నుంచి గాడ్పులు వీయడంతో వాతావరణం వేడెక్కిందని నిపుణులు విశ్లేషించారు.
 
సాధారణంగా మే నెల రెండో వారం తరువాత వీచే గాడ్పులు తుఫాను ప్రభావంతో తొలి వారమే వచ్చాయని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణుడు వ్యాఖ్యానించారు. కాగా, పడమర గాలుల ప్రభావంతో శుక్రవారం నుంచే గాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండు, మూడు రోజుల వరకు తూర్పు గోదావరి నుంచి నెల్లూరు వరకూ, ఇంకా రాయలసీమ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఆర్టీజీఎస్‌ మాత్రం కోస్తాలో మరో ఐదారు రోజులు వడగాడ్పులు వీస్తాయని ప్రకటించింది. కొన్నిచోట్ల 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాలకు సమాచారం అందించి అప్రమత్తం చేసింది. మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని హెచ్చరించింది.
 
ఇంకా పెరుగుతాయా?
ప్రస్తుత ఎండలతోనే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, అవి ఇంకా పెరుగుతాయేమోనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే 2015, 2016 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఆ రెండేళ్లు అత్యధికంగా 49డిగ్రీల ఎండలు కాశాయి. 2వేల మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఆ తరువాత 2017లో నమోదైన 44.9 డిగ్రీలే ఇప్పటిదాకా అత్యధిక ఉష్ణోగ్రతలు.
 
ఉడికిపోతున్న ఉదయాలు
సాధారణంగా ఎండలు మధ్యాహ్నం తర్వాత తీవ్రంగా మారతాయి. మధ్యాహ్నం 2, 3గంటల సమయంలో నమోదయ్యే ఎండలను అత్యధిక ఉష్ణోగ్రతలుగా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ శుక్రవారం ఉదయం నుంచే ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంటకే 44డిగ్రీలు దాటి ఎండలు కాశాయి. సాయంత్రం 4గంటల సమయంలోనూ గుంటూరులోని తాడికొండలో 44.83, చిత్తూరులోని కటికపల్లెలో 44.71, పశ్చిమగోదావరిలోని పత్తిపాడులో 44.83, బాపట్లలో 44.43, కందుకూరులో 44.43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *