ఫలితాల తర్వాతే.. అసలు ఎన్నిక!


  • ప్రభుత్వ ఏర్పాటుపై భిన్న విశ్లేషణలు
  • కీలకంగా ఎన్డీయే దక్కించుకునే సీట్లు
  • దాదాపు 230 అయితే దక్షిణాది హవా
  • 220 కంటే తక్కువైతే మోదీకి కష్టమే
  • తెరపైకి జైట్లీ, రాజ్‌నాథ్‌, గడ్కరీ
  • 200 దాటితే యూపీఏకు తటస్థుల మద్దతు
న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): నాలుగు దశల లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి! మరో మూడు దశలు మిగిలి ఉన్నాయి! కానీ, అసలు ‘ఎన్నిక’ మాత్రం మే 23 తర్వాత అంటే.. ఫలితాలు వెలువడిన తర్వాతే జరగనుంది! ఇందుకు కారణం లేకపోలేదు. ఈసారి ఇటు ఎన్డీయేకు కానీ అటు యూపీఏకు కానీ పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది నేతలు కీలకంగా మారతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ‘కర్ణాటక’ ఫార్ములా తరహాలో దక్షిణాది నేతకు ప్రధాని పదవి దక్కినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం ఢిల్లీలోని రాజకీయ, ఇంటెలిజెన్స్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
ఫలితాల తర్వాత ఎన్డీయేకు సంబంధించి మూడు రకాల పరిస్థితులను ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటిలో మొదటిది, 2014 తరహాలోనే ఎన్డీయే 300 కంటే ఎక్కువ సీట్లు సాధించడం. రెండోది.. ఎన్డీయేకి 200 నుంచి 230 సీట్లు రావడం. మూడోది ఎన్డీయేకు 200లోపు సీట్లు రావడం. అయితే గతంలోలాగా ఎన్డీయేకు 300 సీట్లు రావడం పూర్తిగా అసంభవమని బీజేపీతోపాటు ఇతర రాజకీయ నేతలూ అంగీకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, అసోం తదితర రాష్ట్రాల్లో ఎన్డీయేకు కనీసం వంద సీట్లు తగ్గిపోతాయని విశ్లేషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిసాల్లో బీజేపీకి కొన్ని సీట్లు పెరిగినా.. అక్కడ 10-20 సీట్ల కంటే అదనంగా రాకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్డీయేకు 220 – 230 సీట్లు వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీ ప్రయత్నించవచ్చని అంటున్నారు.
 
ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాదిలో సీఎం కేసీఆర్‌, ఏపీలో వైసీపీ అధినేత జగన్‌, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మద్దతు తీసుకోవడానికి ప్రయత్నిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడులో డీఎంకేను ఆకర్షించడానికి పావులు కదపవచ్చని భావిస్తున్నారు. తటస్థ పార్టీలు, యూపీఏలోని కొన్ని పక్షాల మద్దతు కోరవచ్చని అంటున్నారు. ఒకవేళ ఎన్డీయేకు 220 కంటే సీట్లు తగ్గితే, మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్డీయేకు 50కిపైగా సీట్లు తగ్గితే, ప్రధాని పదవిని మరొకరికి అప్పజెప్పమనే డిమాండ్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు సన్నిహితంగా ఉండే నేతను ప్రధానిగా నియమించేందుకు మోదీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరుల పేర్లు తెరపైకి రావచ్చని భావిస్తున్నారు. దక్షిణాది నుంచి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని క్రియాశీల రాజకీయాల్లోకి దించే అవకాశాలపైనా చర్చలు సాగుతున్నాయి. నితిన్‌ గడ్కరీకి అధికారం అప్పగించేందుకు మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని బీజేపీ నేత ఒకరు స్పష్టం చేశారు. ఇక, ఎన్డీయేకు 200 కంటే సీట్లు తగ్గితే ప్రతిపక్షంలో కూర్చోవడానికే బీజేపీ ఎక్కువగా మొగ్గు చూపవచ్చని అంటున్నారు.
 
యూపీఏకు ఉన్న అవకాశాలు ఇవీ!
ప్రభుత్వాన్ని యూపీఏ ఏర్పాటు చేసే అవకాశాలపైనా రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. యూపీఏ 200 సీట్ల కంటే ఎక్కువ సాధిస్తే.. తటస్థ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం.. కాంగ్రె్‌సకు 115 నుంచి 125 సీట్లు, దాని మిత్ర పక్షాలకు 60 నుంచి 70 సీట్లకు మించి రాకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే, తటస్థ పార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితరాలు కీలకం అవుతాయని చెబుతున్నారు. ఒకవేళ, యూపీఏకు 175 కంటే తక్కువ సీట్లు వస్తే మాత్రం.. కర్ణాటక నమూనాను ఆశ్రయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కాంగ్రెస్‌ మిత్రపక్షాలకు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
 
దక్షిణాది నేతకు ప్రధాని పీఠం!?
అటు ఎన్డీయేకు, ఇటు యూపీఏకు 200 సీట్లు కూడా దాటకపోతే.. ‘కర్ణాటక’ ఫార్ములా తెరపైకి వస్తే.. ‘అదృష్టం’ ఎవరిని వరిస్తుందనే అంశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఎక్కువ ప్రాంతీయ పార్టీలు బీజేపీయేతర సంకీర్ణానికే మొగ్గు చూపవచ్చని భావిస్తున్నాయి. అప్పుడు, కాంగ్రెస్‌ నేతృత్వంలో కానీ, కాంగ్రెసేతరంగా కానీ కూటమి ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ, కాంగ్రె్‌సకు వంద సీట్లు దాటితే, దక్షిణాది నేతను ప్రధాని పదవికి రాహుల్‌ తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ వర్గం అంచనా వేస్తోంది. అప్పుడు కూటమికి దక్షిణాది కాంగ్రెస్‌ నేత నేతృత్వం వహించవచ్చని విశ్లేషిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *