ఫైళ్లకు రెక్కలు!


  • కీలకమైన నోట్‌ఫైల్‌ నకళ్లూ తరలింపు
  • ‘పనికొస్తాయేమో చూడండి’ అంటూ విపక్ష శిబిరానికి అందజేత
  • మెహర్బానీ కోసం అధికార దుర్వినియోగం
  • సచివాలయం, హెచ్‌వోడీల్లో కొందరి హల్‌చల్‌
  • ప్రైవేటు వ్యక్తులతోనూ యథేచ్ఛగా తరలింపు
  • స్వీయ రక్షణలో మరికొందరు అధికారులు
  • నిర్ణయాలను వివాదం చేస్తారనే భయం
  • ముందుజాగ్రత్తగా నోట్‌ ఫైళ్లకు నకళ్లు
ఇటీవల… సచివాలయంలోని ఒక ముఖ్యమైన అధికారి చాంబర్‌లోకి ఒక వ్యక్తి వెళ్లారు. దాదాపు 20 నిమిషాల తర్వాత బయటికి వచ్చారు. ఒక పెన్‌డ్రైవ్‌ను ఎంచక్కా తన ప్యాకెట్‌లో పెట్టుకుని వెళ్లిపోయారు. లోపల ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు!
 
అటు సచివాలయంలోని ముఖ్య శాఖల్లో, ఇటు కొన్నిముఖ్యమైన శాఖాధిపతుల కార్యాలయాల్లో ‘సమాచార సరఫరా’ యథేచ్ఛగా సాగుతోంది. ఫైళ్లకు, ఈ-ఫైళ్లకు రెక్కలొస్తున్నాయి. కీలకమైన పత్రాలు ఎక్కడెక్కడికో చేరిపోతున్నాయి. రహస్యంగా ఉంచాల్సిన నోట్‌ ఫైళ్లకూ నకళ్లు తీసి తరలిస్తున్నారు.
 (అమరావతి – ఆంధ్రజ్యోతి)
ఇది పోలింగ్‌కు, ఫలితాలకూ మధ్య ఉన్న సంధికాలం! పలువురు అధికారులు తమ రాజకీయ ఆసక్తులు, అంచనాలకు అనుగుణంగా ఏదో ఒక ‘గట్టు’కు చేరుకున్నట్లు గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇలాంటి అధికారులే ఇప్పుడు ఫైళ్ల తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్న కొందరు ముఖ్య అధికారులు… జగన్‌ శిబిరం మెప్పు కోసం కీలక ఫైళ్ల ప్రతులను అందిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీ అభిమానులుగా ముద్ర వేయించుకుంటే… భవిష్యత్తులో పనికొస్తుందనే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి… ‘‘మీకు ఏ అంశానికి సంబంధించిన ఫైలు కావాలో చెప్పండి. ఆ ఫైలు, దానిలోని నోట్‌ ఫైలు ప్రతులన్నీ తీసి పంపిస్తాం’’ అని ఓపెన్‌ ఆఫర్లు ఇస్తున్నారు. ఏదైనా నిర్ణయం వెనుక తప్పు జరగడం, జరగకపోవడంతో సంబంధం లేకుండా ‘మీకు పనికొస్తుందేమో చూడండి’ అంటూ సలహా ఇవ్వడంతోపాటు ఫైలుప్రతిని అందిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను తమ కార్యాలయాల్లోకి రప్పిం చి ఫైళ్ల ప్రతులను ఇచ్చి పంపించేస్తున్నారు. ని త్యం నిఘా ఉండే సచివాలయ శాఖల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్చగా వచ్చి వెళ్లిపోతున్నారు.
 
వీరిది మరోరకం జాగ్రత్త
ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది? టీడీపీ ప్రభుత్వం కొనసాగుతుందా? వైసీపీ వస్తుందా? దీనిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే, అధికారుల స్థాయిలోనూ వైసీపీ ‘అనుకూలుర’ హల్‌చల్‌, హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి వారిలోనే కొందరు ‘మేము సైతం’ అంటూ కీలక ఫైళ్లకు రెక్కలు తొడుగుతున్నారు. ఇది మిగిలిన అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తాము కీలక స్థానాల్లో ఉండగా తీసుకున్న నిర్ణయాలను వివాదాస్పదం చేస్తే ఎలా? తమను తాము కాపాడుకునే ఆధారాలు ఉంటే మంచిదని జాగ్రత్తపడుతున్నారు. ఆ నిర్ణయాల సందర్భంగా స్వదస్తూరీ రాసిన తమ అభిప్రాయాల తాలూకు నోట్‌ఫైళ్ల నకళ్లు తీసుకుని, భద్రపరుచుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయాలపై ఎలాంటి వివాదాలు వచ్చినా.. ఈ సమాచారం దగ్గర ఉంటే మంచిదన్నది వీరి భావన.
 
నిర్ణయం వెనక నోట్‌ ఫైళ్లే కీలకం!
ప్రభుత్వంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు సంబంధిత ఫైల్‌లో రాసిన నోట్‌ చాలా కీలకం. ఆ నోట్‌ ఫైల్‌ ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. అధికారి నుంచి నుంచి మంత్రి, ముఖ్యమంత్రి దాకా తమతమ అభిప్రాయాలను నోట్‌ఫైల్‌లో రాస్తారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. నోట్‌ఫైళ్లను ఇవ్వకుండా తిరస్కరించవచ్చు. కొన్నిఅంశాలు రహస్యమని.. ఇవ్వలేమని చెప్పొచ్చు. అలాంటి కీలకమైన నోట్‌ ఫైళ్లు కూడా ఇప్పుడు మూడోకంటికి తెలియకుండా నకళ్లు తీయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిస్తే.. యథాతథస్థితి ఉం టుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే.. ఎలాంటి ఫైళ్లనైనా అధికారికంగానే పరిశీలించవచ్చు. ఇప్పుడు కేవలం కొందరు ఉన్నతాధికారులు తమ మెహర్బానీ ప్రదర్శించేందుకే… ఫైళ్లు, సమాచార తరలింపులో నిమగ్నమయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది.
 
ఎప్పటి నుంచో ‘తవ్వకాలు’
గత ఐదేళ్లలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఇప్పుడు దృష్టి సారించారు. అవసరమైతే పలు శాఖల నుంచి కొన్ని అంశాలకు సంబంధించిన ఫైళ్లను పంపించాలని ‘ఆదేశాలు’ వెళ్తున్నాయి. అదే సమయంలో కొందరు ఉన్నతాధికారులు కొన్ని అంశాలపై ఆకస్మిక సమీక్షలు పెడుతున్నారు. గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని పంపాలని అడుగుతున్నారు. అలా పంపిన వాటిని పరిశీలించి, అందులో కీలకమైన అంశాల ఫైళ్లను పూర్తిస్థాయిలో ఈ-ఫైలింగ్‌ లేదా ఫిజికల్‌గా పంపాలని అడుగుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *