ఫోర్జరీ పత్రంతో ఉద్యోగం


  •  హైదరాబాదీ మహిళకు ఏడాది జైలు
  •  తొమ్మిదేళ్ల క్రితమే రాజీనామా చేసి భారత్‌కు
  •  మక్కావెళ్లేందుకు సౌదీకి రాగా అరెస్టు
(‘గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
సౌదీలో ఫోర్జరీ పత్రంతో ఉద్యోగంలో చేరిన నేరానికి హైదరాబాద్‌కు చెందిన ఓ మహళకు ఏడాది జైలు శిక్ష, 5వేల రియాద్‌ల జరిమానా పడింది. చిత్రం ఏమిటంటే ఆమె ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తొమ్మిదేళ్ల క్రితమే స్వదేశానికి వెళ్లిపోయింది. అయితే మక్కా యాత్ర కోసం ఆమె సౌదీకి రాగా విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నాంపల్లి పటేల్‌ నగర్‌కు చెందిన నస్రీన్‌ బేగం (48) ఇరవై ఏళ్లక్రితం ఉద్యోగం కోసం సౌదీకి వచ్చింది. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఏడాది కోర్సు చేసింది. అయితే.. ఇక్కడ నిబంధనల ప్రకారం ఏడాది మెడికల్‌ కోర్సును గుర్తించరు. దీంతో తాను రెండేళ్ల కోర్సు చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి ఉద్యోగంలో చేరింది. దాదాపు పదిన్నరేళ్లు ఆమె సమర్థంగా పనిచేసింది. తర్వాత రాజీనామా చేసి స్వదేశానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమె సమర్పించిన పత్రాలు నకిలీవని తనిఖీలో తేలడంతో ఆమెపై ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి తొమ్మిదేళ్లవుతోంది.
 
ఈ విషయం తెలియని నస్రీన్‌, తన తల్లిదండ్రులతో కలిసి మక్కా దర్శనం(ఉమ్ర) కొరకు కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌ నుంచి సౌదీకి వచ్చింది. జెద్ధా విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు అమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమను 1500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంకు తరలించారు. అక్కడ అమెపై కేసు నమోదైంది. ఇటీవల నస్రీన్‌ కేసును విచారించిన న్యాయస్ధానం అమెకు ఏడాది జైలు శిక్ష, 5వేల రియాద్‌ల జరిమానా విధించింది. ఈ విషయంలో న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బాధిత కుటుంబం విన్నవించుకున్నా ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా నస్రీన్‌కు రంజాన్‌లో క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయించడానికి మంజు మణికంఠన్‌ అనే భారతీయ సామాజిక కార్యకర్త ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్‌ బోయినపల్లికు చెందిన స్వప్న అనే నర్సుకు కూడా ఇదే రకమైన నేరంపై న్యాయస్థానం శిక్ష విధించింది. అనేక మంది భారతీయ నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది ఈ రకమైన ఫోర్జరీ నేరాలపై ఇక్కడ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *