బంగారంపై అపోహలొద్దు


  • ఏప్రిల్‌లో హుండీ ఆదాయం 84.27కోట్లు : టీటీడీ ఈవో
తిరుమల, మే 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో జరిపిన తనిఖీల్లో పట్టుబడి టీటీటీ ఖజానాకు చేరిన బంగారంపై అపోహలకు గురికావద్దని భక్తులకు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బంగారం రవాణా బాధ్యతలను ఒక ఏజెన్సీకి అప్పగించిందని, వారు దాన్ని తెచ్చి తిరుపతిలోని బ్యాంకు శాఖలో అప్పగించాల్సి ఉందని చెప్పారు. ఏజెన్సీ సిబ్బంది సరైన పత్రాలు చూపినా తమిళనాడులో ఎన్నికల సందర్భంగా అధికారులు సీజ్‌ చేశారన్నారు.
 
దీనిపై కలెక్టర్‌ విచారణ జరిపి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో బ్యాంకు బంగారాన్ని స్వాధీనం చేసుకుని టీటీడీకి అప్పగించిందని తెలిపారు. వాస్తవాలు ఇలాఉంటే కొంతమంది రకరకాలుగా ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. బంగారం తరలింపుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశంపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతనెల శ్రీవారికి హుండీ ద్వారా రూ.84.27కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగా, ఆగస్టుకు సంబంధించి 67,737 ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *