బంగాళాఖాతంలో వాయుగుండం


  • నేటి రాత్రికి తుఫానుగా బలపడే అవకాశం
  • 30 సాయంత్రానికి దక్షిణ కోస్తా సమీపంలోకి
  • సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు: ఐఎండీ
విశాఖపట్నం/అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి చెన్నైకి ఆగ్నేయంగా 1,440కి.మీ, మచిలీపట్నానికి 1,720కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుఫానుగా బలపడే క్రమంలో శ్రీలంక తీరానికి ఆనుకుని వాయవ్యంగా పయనించి 29న సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. తరువాత తీవ్ర తుఫానుగానే ఈనెల 30న సాయంత్రానికి ఉత్తర తమిళనాడు/ దక్షిణకోస్తా తీరందిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని పలు మోడళ్లు వెల్లడిస్తున్నాయి.
 
కాగా, తుఫాను ప్రభావంతో ఈనెల 29నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో వర్షాలు ప్రారంభమై 30కల్లా అనేకచోట్ల భారీవర్షాలు కురుస్తాయి. 29నుంచి తీరం వెంబడి గాలుల తీవ్రత పెరుగుతుందని, 30న గంటకు 100- 115 కి.మీ. వేగంతో వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా, తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయని, ఈనెల 27నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని ఆర్టీజీఎస్‌ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లినవారంతా 28లోగా వెనక్కి రావాలని సూచించారు. తీరప్రాంతాలకు ఎవరూ వెళ్లరాదని, సముద్ర స్నానాలు చేయడం, అలలతో ఆడుకోవడం వంటివి చేయరాదని కోరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *