బంగ్లార్‌ అగ్నికన్య


  • కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టిన ఫైర్‌ బ్రాండ్‌
  • బెంగాల్‌ రాజకీయ యవనికపై చెరగని ముద్ర.. మమతాబెనర్జీ
సన్నటి అంచున్న తెల్లటి చేనేత చీర.. చేతికి గుడ్డ సంచి.. కాళ్లకు రబ్బరు చెప్పులు! ఆమె ఆహార్యం సాధారణం!! కానీ, ఆమె రాజకీయ చాణక్యం మాత్రం.. అసాధారణం!! మూడు దశాబ్దాలపాటు పశ్చిమ బెంగాల్‌ను ఏలిన కమ్యూనిస్టులను సై అంటే సై అంటూ ఢీకొట్టి ఒంటిచేత్తో ఓడించి అధికారంలోకి వచ్చిన ధీర ఆమె! కాంగ్రెస్‌ పార్టీకి సాధ్యంకాని పనిని చేసి చూపించిన సబల. బెంగాల్‌వాసులకు ఆమె దీదీ. రాజకీయ ప్రత్యర్థులకు ఫైర్‌బ్రాండ్‌. ఆమే.. బంగ్లార్‌ అగ్ని కన్య.. మమతా బెనర్జీ. సర్టిఫికెట్ల ప్రకారం ఆమె పుట్టినరోజు జనవరి 5. కానీ.. ఆమె 1955లో దుర్గాష్టమి రోజున జన్మించారు.
 
మమతా బెనర్జీ తండ్రి.. బెంగాల్‌ ప్రజలకు చిరపరిచితుడైన స్వాతంత్య్ర సమరయోధుడు ప్రమీలేశ్వర్‌ బెనర్జీ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆమెకు పదిహేనేళ్ల వయసప్పుడు తండ్రిని కోల్పోయారు. దీంతో.. కాలేజీకి వెళ్తూనే ఇంటిని పోషించడం కోసం ఓ స్కూల్లో టీచర్‌గా చేరారు. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లో ఉధృతంగా పాల్గొన్నప్పుడు అరెస్టయితే.. లాక్‌పకి పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లి చదివి పాసయ్యారామె.
 
యువజన కాంగ్రెస్‌ కార్యకర్తగా మొదలైన మమత పొలిటికల్‌ కెరీర్‌ తర్వాతి దశలో పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరింది. 1984లో జాదవ్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి ఆమె పోటీ చేశారు. అప్పుడు ఆమె ప్రత్యర్థి.. సీపీఎం దిగ్గజ నేత సోమ్‌నాథ్‌ చటర్జీ. ఆయనపై దాదాపు 48 వేల ఓట్ల తేడాతో గెలవడంతో ఆమె పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. ఆమె మాత్రం ఆ అహాన్ని తలకెక్కించుకోలేదు. గెలవగానే.. ఆయన ఆశీర్వాదం కోసం వెళ్లి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. బెంగాల్లో సీపీఎం ప్రభుత్వానికి తైనాతీలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ తీరుతో విసిగిపోయి పార్టీ నుంచి బయటికొచ్చి ‘తృణమూల్‌ కాంగ్రెస్‌’ను స్థాపించారు.
 
2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఒక్క సీటే వచ్చింది. కానీ.. ఆమె మాత్రం అధైర్యపడకుండా ఒక్కొక్క ఇటుకా పేర్చుకుంటూ, పార్టీని బలోపేతం చేశారు. 2007లో సింగూర్‌, నందిగ్రామ్‌లలో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2011 నాటికి బెంగాల్‌ సీఎం కాగలిగారు.
 
2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినా.. బెంగాల్‌లో మాత్రం దీదీ హవా కొనసాగింది. 42 లోక్‌సభ సీట్లలో 34 స్థానంలో టీఎంసీ గెలుచుకుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 211 సీట్లతో బెంగాల్‌ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా.. అదే ధీమాతో ఆమె మోదీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలోని 42 సీట్లలో 30 తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యూహ త్మకంగా 34 మంది సిటింగ్‌ ఎంపీల్లో 10 మందికి చెక్‌ పెట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే చిరకాల స్వప్నం సాకారం దిశగా అడుగులేస్తున్నారు.
 
చిత్రకారిణి.. కవయిత్రి..
చిత్రలేఖనం, కవితలు రాయడం ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. ఆమె గీసిన చిత్రాలను విక్రయించగా వచ్చిన సొమ్మును పార్టీకి ఇస్తారు. అలాగే, ఆమె ఇప్పటికి 12 దాకా పుస్తకాలు కూడా రాశారు. చిన్నపిల్లల గేయాలు రాయడమంటే చాలా ఇష్టం.
 
ఎంపీ గల్లా పట్టి…
1998 డిసెంబరు 11న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఈక్రమంలో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ దరోగా ప్రసాద్‌ సరోజ్‌ను గల్లా పట్టి బయటికి ఈడ్చారు మమతా బెనర్జీ.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *