బకాయిల తిప్పలు!


  • వసూళ్లలో వీఎంసీ బోల్తా
  • పెండింగ్‌లో సుమారు రూ.100 కోట్లు.. రాబట్టడంలో అధికారుల విఫలం
  • సమ్మెకు సిద్ధమవుతోన్న కాంట్రాక్టర్లు
  • నచ్చచెబుతోన్న మేయర్‌, ఇతర ప్రజా ప్రతినిధులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ: అడగడుగునా అప్పులు.. అడగాలంటే ఆంక్షలు. పెండింగ్‌లో బకాయిలు.. రాబట్టడా నికి పాలక వర్గం తిప్పలు. ఇదీ గ్రేటర్‌గా ఎదగబోతున్న నగర పాలక సంస్థ దుస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన ఉద్యోగులకు 010, రూ.రెండు వేల కోట్ల బడ్జెట్‌తో ఆహా అనిపించిన వీఎంసీ నేడు బకాయిల వసూళ్లలో బోల్తా పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన దాదాపు రూ.వంద కోట్ల బకాయుల్ని రాబట్టడానికి పూనుకోలేకపోతున్న అధికారులు పర్య వేక్షణలకే పరిమితమవుతున్నారు. సచివాల యం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోన్న మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ పీయూష్‌ గోయల్‌, ఎమ్‌ఏయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చుట్టూ బకాయిల వసూళ్లకు పట్టుపడుతున్నారు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్న వేళ రూ.32 కోట్ల బకాయిల పెండింగ్‌పై కాంట్రాక్టర్లు సమ్మెకు సైరన్‌ వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొన సాగితే రోజుల వ్యవధిలో వీఎంసీ ఉద్యోగులు కూడా రోడ్డెక్కే పరిస్థితి దాపురించేలా ఉంది.
 
కార్పొరేషన్లో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 49 మంది ఉద్యోగులకు రూ.6.5 కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉండగా.. కడుపు మండుతున్నా ఉద్యోగులు నోరుతెరవలేక పోతున్నారు. కరెంట్‌ బిల్లులు, బ్యాంకు చెల్లింపులకు రూ.మూడేసి కోట్లు వెతుక్కో వాల్సిన పరిస్థితి ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ. వంద కోట్ల అవసరాలకు వీఎంసీ అర్రులు చాస్తోంది. కార్పొరేషన్‌కు నేరుగా రావాల్సిన పన్నులు, బిల్లుల్లో వాటా లను ఆయా ప్రభుత్వ శాఖలు కలెక్ట్‌ చేసి తర్వాత ఇస్తామన్న ఆంక్షలతో కార్పొరేషన్‌ నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. వృత్తి పన్నుల చెల్లింపుల్లో కమర్షియల్‌ ట్యాక్సు శాఖ 5ు వాటా పోనూ వీఎంసీ 95ు వాటాను వెనక్కు పంపాల్సిన ఆ శాఖ జనవరి 2018 నుంచి వీఎంసీ వాటాల్ని నిలిపివేసింది. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌(కమర్షియల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌) సాకుతో పెండింగ్‌లో పెట్టారు. ఫలితంగా వీఎంసీకి రావాల్సిన రూ.19కోట్లు నేటికీ కమర్షియల్‌ ట్యాక్సు కార్యాలయం గుమ్మం దాటి రావట్లేదు. దీంతో 2019 జనవరి నుంచి వీఎంసీకి చేరుతున్న పన్నుల పంపిణీని ఆ శాఖకు పంపకూడదని కమిషనర్‌ మట్టా రామారావు నిర్ణయించారు. కాగా బకాయిల్ని మాత్రం వసూలు చేయలేకపోతున్నారు.
 
విడుదల కాని బకాయిలు
2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.9కోట్లు డీఎమ్‌ఏ నుంచి నేటికీ విడుదల వ్వలేదు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.10కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలై జేషన్‌)కు చెందిన రూ.5కోట్ల బకాయిలు కూడా వీఎంసీకి చేరలేదు. ఇలా చిన్న చిన్న బకాయిల కారణంగా కార్పొరేషన్లో జీతాలతో పాటు కరెంట్‌ బిల్లులకు కూడా వెతుక్కో వాల్సిన పరిస్థితి వచ్చిందని మేయర్‌ వాపోతున్నారు. పలుమార్లు సచివాలయ ఉన్నతాధికారులను కలిసినా 010 పద్దు ఉందిగా ఇంకా జీతాలేంటంటూ సమాధాన మిస్తున్నారు. మరి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మాటేంటని అడిగితే వస్తాయిలే అన్న మాటలే ఎదురవుతున్నాయని తెలుస్తోంది. స్థానికంగా ఎదగాల్సిన నగర పాలన ఇలా బకాయిల్లో పడి మూలుగుతుంటే స్వయం అభివృద్ధికి అవకాశమేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
ఇవీ లెక్కలు
వరుస
సంఖ్య విభాగం బకాయిలు
1. పన్నులు (2018-19) రూ.9కోట్లు
2. టౌన్‌ప్లానింగ్‌ రూ.5కోట్లు
3. 14వ ఆర్థిక సంఘం రూ.13కోట్లు
4. అమృత్‌ పథకం రూ.6.5కోట్లు
5. కాంట్రాక్టర్లకు రూ.32కోట్లు(ఖర్చు)
6. కరెంట్‌, ఆయిల్‌ బిల్లులు రూ.4కోట్లు
7. బ్యాంకు చెల్లింపులు రూ.3కోట్లు
8. ఉద్యోగులు(రిటైర్డ్‌) రూ.38కోట్లు
9. ఉద్యోగులు(రెగ్యులర్‌) రూ.2కోట్లకుపైగా

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *