బతికుండగానే చంపేశారు!


  • గుంటూరు సర్వజన ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం
  • డెత్‌ రశీదు రెండు సార్లు మంజూరు
గుంటూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): వైద్యోనారాయణ హరి అన్నది నానుడి. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్యులు ఓ రోగిని బతికుండగానే హరి అనిపించేశారు. బంధువులకు డెత్‌ రశీదు(డిక్లరేషన్‌) కూడా ఇచ్చేశారు. బంధువులు నిలదీయగా, మరోసారి పరీక్షించిన వైద్యులు సారీ అంటూ మళ్లీ చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత రెండు రోజులకు పరిస్థితి విషమించి చనిపోతే మరోమారు డెత్‌ రశీదు ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. గుంటూరు రూర ల్‌ మండలం పెదపలకలూరుకు చెందిన కోకుట్లపల్లి ఆదినారాయణ ఈ నెల 20న సున్నం పనికి వెళ్లి, కళ్లు తిరిగి పడిపోయాడు. అతనితో పాటు పనికి వెళ్లిన కుమారుడు బాబు వెంటనే జీజీహెచ్‌కుతీసుకురాగా, క్యాజువాల్టీలో చికిత్స ప్రారంభించారు. అదేరోజే రాత్రి అతను చనిపోయినట్టు బంధువులకు తెలిపి, డెత్‌ రశీదు కూడా ఇచ్చారు.
 
ఆదినారాయణ బతికే ఉన్నాడంటూ సిబ్బందిని బంధువులు నిలదీయడంతో వైద్యులు వచ్చి, నాడి పరీక్షించి బతికే ఉన్నట్టు నిర్ధారించారు. బంధువులకు సారీ చెప్పి తిరిగి చికిత్స ప్రారంభించారు. డెత్‌ రశీదును వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆ లోపే బంధువులు ఆ రశీదును జిరాక్స్‌ తీయించారు. రెండోసారి చికిత్స ప్రారంభించాక ఆదినారాయణను క్యాజువాల్టీ నుంచి రూం నంబరు 330కు మార్చారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ఈ నెల 22న ఆదినారాయణ మృతి చెందారు. దీంతో ఆదినారాయణ మృతి చెందినట్లు 22న మరోమారు డెత్‌ రశీదు ఇచ్చారు. ఆదినారాయణకు నివాళి అర్పించేందుకు వచ్చిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే టి.అమృతరావు మనవడు, గాంధీ మిషన్‌ అధ్యక్షుడు మోహన్‌ గాంధీ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
 
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
బతికుండగానే చనిపోయినట్టు డెత్‌ రశీదు ఇచ్చిన ఘటనపై సమాచారం తెప్పించుకుంటున్నాం. పూర్తి సమాచారం వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలుంటాయి.
– డాక్టర్‌ రాజునాయుడు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *