బస్సులు తిప్పలేక అద్దెలదరువా?


  • ఆర్టీసీలో అధికారుల నిర్ణయాలపై వ్యతిరేకత
  • అద్దె డ్రైవర్లు, అద్దె బస్సులు నడపాలన్న ప్రతిపాదనపై కార్మికుల ఆగ్రహం
  • పదవీ విరమణ పొందిన వారితో బస్సులు నడపడం సరేనా?
  • కార్మిక సంఘాలను హెచ్చరిస్తున్న కార్మికులు
ఆడలేక మద్దెలదరువు అన్నట్టు.. బస్సులు తిప్పలేక ఆర్టీసీ అధికారులు ‘అద్దెల’దరువు మోగిస్తున్నారు. అద్దె డ్రైవర్లతో పాటు అద్దె బస్సులను నడపాలన్న ఆలోచనను తెరపైకి తెస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా అధికారుల ఈ నిర్ణయంపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో బస్సులు ఎలా నడుపుతారని, ఎంతవరకు సురక్షితమని ప్రశ్నిస్తున్నారు.
 
ఆంధ్రజ్యోతి విజయవాడ : రెండేళ్ల నుంచి ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల సమస్య పట్టి పీడిస్తోంది. డ్రైవర్ల కొరత కాస్త ఎక్కువగా ఉంది. గతంలో కాంట్రాక్టు పద్ధతిన డ్రైవర్లను తీసుకునేవారు. ఈ పద్ధతికి అర దశాబ్దకాలం కిందట స్వస్తి పలికారు. విజయవాడ జోన్‌లోని కృష్ణాజిల్లాలో 75 మందికి పైగా డ్రైవర్ల అవసరం రెండేళ్ల కిందట ఉండేది. గుంటూరు రీజియన్‌లో సుమారు 55 మందికి పైగా డ్రైవర్ల అవసరం ఉంది. కండక్టర్లతో కలిపితే ఈ రెండు రీజియన్లలో 350 నుంచి 400 ఖాళీలు ఉన్నాయి. విజయవాడ జోన్‌లోని మరో రీజియన్‌ పశ్చిమ గోదావరిలో 150 మంది కొరత ఉంది. వీరిలో 45 మంది డ్రైవర్లు, 25 మంది కండక్టర్లు అవసరం. ప్రస్తుతమున్న డ్రైవర్లు, కండక్టర్లలో మరో 50 మంది వరకు ఏడీసీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఇలాంటి పదోన్నతులు పొందేవారు కృష్ణా, గుంటూరు రీజియన్లలోనూ ఉన్నారు. వీరంతా పదోన్నతులు పొందితే మరిన్ని పోస్టులు ఖాళీ అవుతాయి. వీరితో పాటు పదవీ విరమణ చెందేవారు ఏటా పెరుగుతారు. వీరి సంఖ్యతో కూడా కలిపి చూస్తే విజయవాడ జోన్‌లో సుమారు 500 మంది కార్మికుల అవసరం ఉంది. వీరందరినీ భర్తీ చేయాల్సి ఉంది.
 
సమస్య జఠిలం
కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌ చేసినప్పటికీ 360 రోజులు గడిస్తే రెగ్యులర్‌ చేయాలన్నది ప్రభుత్వ స్థాయిలో కార్మిక సంఘాల మధ్య ఉన్న ఒప్పందం. ఏటా కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్‌ అవుతూనే ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయటానికి సాహసించటం లేదు. రెండేళ్లుగా సిబ్బంది కొరత తక్కువగా ఉన్నా.. ఆ ప్రభావం కనిపించకుండా ఆర్టీసీ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. స్టాఫ్‌ నిష్పత్తిని కుదించటం, బస్సు సర్వీసులను తగ్గించటం వంటి చర్యలతో డ్రైవర్ల కొరత ప్రభావం పెద్దగా కనిపించట్లేదు. అయితే, ఈ ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఉన్న బస్సులను నడపటానికే సిబ్బంది సరిపోని పరిస్థితి. దీంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలన్న దానిపై ఆర్టీసీ యాజమాన్యం తలపట్టుకుంటోంది.
 
అద్దె బస్సుల నిర్ణయం సరైనదేనా?
తీవ్ర సమాలోచనల అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారులు రెండు నూతన విధానాలను కనుగొన్నారు. వీటికి సంబంధించి కొద్దిరోజులుగా ఉన్నతస్థాయి అధికారులే లీకులిస్తుండటం గమనార్హం. ఇందులో మొదటి విధానం అద్దె బస్సులు. రెండోది అద్దె డ్రైవర్లు. అద్దె బస్సులు తీసుకుంటే అదనంగా బస్సులు సమకూరటంతో పాటు సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. డ్రైవర్లను బస్సు యజమానులే నియమించుకుంటారు. కేవలం ఒక్క కండక్టర్‌నే ఆర్టీసీ ఇస్తే సరిపోతుంది. దీనికోసం అద్దె బస్సులను పెంచుతామని, 30 శాతానికిపైగా పెంచుకోవటానికి బోర్డు అనుమతి ఉందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచినా రూట్లన్నింటికీ వస్తాయన్న గ్యారంటీ లేదు. లాభమనుకున్న రూట్లలోనే నడుపుతారు.
 
వ్యతిరేకిస్తున్న కార్మికులు
ఈ క్రమంలోనే ఆర్టీసీ యాజమాన్యం అద్దె డ్రైవర్ల విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. సంస్థలో పదవీ విరమణ పొందిన డ్రైవర్ల సేవలను అవసరమైనపుడు వినియోగించుకోవాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. వీరి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోరు. అవసరమైన సందర్భంలోనే ఉపయోగించుకుంటారు. అంటే.. నెలలో వారం రోజులు ఉండవచ్చు. రెండు వారాలు ఉండకపోవచ్చు. సీజన్‌ అయితే నెల రోజులూ ఉండవచ్చు. రోజూ కొనసాగించే అవకాశం మాత్రం లేదు. ఇలా సేవలు అందించే డ్రైవర్లకు రోజుకు రూ.600 దినసరి వేతనం ఇస్తారు. వారు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకు రూ.600 చొప్పున ఇవ్వాలి. అయితే, ఈ విధానాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. పదవీ విరమణ పొందిన డ్రైవర్లు బస్సులను నడపలేరని, ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. బస్సుల కండీషన్‌ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో అలాంటి వారితో డ్రైవ్‌ చేయించడం వల్ల సంస్థ నష్టపోతుందంటున్నారు.
 
అధ్యయనం చేస్తున్నాం..
పదవీ విరమణ పొందిన కార్మికులను తీసుకోవాలన్న ఆలోచనలపై కార్మికుల నుంచి మాపై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం. దీనిపై కార్మిక సంఘంగా మేము సీరియస్‌గానే చర్చిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాజధాని ప్రాంతంలో అయితే ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. సిబ్బంది భర్తీకి సంబంధించి ఎలాంటి విధానాలు తీసుకోవాలన్న దానిపై మేము కూడా అధ్యయనం చేస్తున్నాం. అతిత్వరలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తాం.
– మన్నే దుర్గా ప్రసాదరావు, ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకుడు

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *