బాబోయ్‌… తట్టుకోలేం!


  • గుంటూరు రైల్వేడివిజన్‌లో పెరుగుతున్న పనిభారం
  • నెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
  • ఉండాల్సిన పోస్టులు 4,750… ఉన్నవి 3,860
  • పెరిగిన ఎలక్ట్రికల్‌ లైన్‌ పరిధి
గుంటూరు (సంగడిగుంట): గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఉద్యో గులపై పనిభారం పెరుగుతుందా..? ఒత్తిడి తట్టుకోలేక ఒకవైపు… ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక మరో వైపు ఉద్యోగులు నలిగిపోతున్నారా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. దీనికి ఉదాహరణలే నెలల వ్యవధిలో ఇద్దరు ఉద్యోగులు స్టేషన్‌ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించడం. నాలుగు నెలల క్రితం కమర్షియల్‌ విభాగం ఉద్యోగి కరీముల్లా ఎదురుగా వస్తున్న రైలు కింద పడబోయాడు. సోమవారం ఎలక్ట్రికల్‌ విభాగం ఉద్యోగి పవన్‌కుమార్‌ ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫారమ్‌పైనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోబోయారు. వీరిద్దరి వాదన ఒకేవిధంగా ఉంది. ఉన్నతాధికారులు సమయానికి మించి డ్యూటీలు ఇస్తున్నారని, చేయలేక కాదనలేక సతమ తమయిపోతున్నామని, కొన్ని నెలలు అయితే సర్దుకోగలం కానీ కొన్నేళ్ల పాటు ఇలా చేయాలంటే సాధ్యం కాదంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన చెందు తున్నారు.
 
గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోకి సంవత్సరం క్రితం బోర్డుకు కేటాయించిన ఉద్యోగుల సంఖ్య 4,750 ఉండాలి. కానీ ఇప్పటి వరకు కేటాయించిన ఉద్యోగులు 3,860 మంది మాత్రమే. అంటే దాదాపు 25 శాతం మంది తక్కువ ఉద్యోగులతో డివిజన్‌ పూర్తి బాధ్యత నిర్వహిస్తోంది. దీనికితోడు గత రెండేళ్లలో గుంటూరు డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు జరగడం కారణంగా పరిధి పెరిగింది. గుంటూరు – గుంతకల్లు మార్గం డబ్లింగ్‌ పనులు జరుగుతుండడం పూర్తిగా విద్యుద్దీకరణ జరిగే ప్రయత్నాలు చేస్తుండడం గుంటూరు తెనాలి డబ్లింగ్‌ పనులు పూర్తి చేయడం. ఈ మార్గంలో కూడా పూర్తిస్థాయి విద్యుద్దీకరణ జరగడంతో ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పనిభారం పెరిగింది. విద్యుత్‌ విభాగానికి ఒకరకంగా పని రెట్టింపు అయ్యింది.
 
గత రెండేళ్లలో డివిజన్‌ పరిధిలో అదనంగా 300 కిలో మీటర్లు విద్యుద్దీకరణ జరిగింది. దీని నిర్వహణ కూడా గతంలో ఉన్న ఉద్యోగులే చూస్తున్నారు. దీంతో పని భారం పెరిగి ఆ విభాగంలో సెలవులు కూడా కరువయ్యాయి. ఈ విభాగంలో మొత్తం 49 పోసులకుగాను 37 పోస్టులను మాత్రమే భర్తీచేశారు. దీంతోనే డివిజన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అయితే పరిస్థితి చెప్పవలసిన పనిలేదు. గ్యాంగ్‌మెన్‌, నైట్‌ వాచ్‌మెన్‌ల కొరత 50 శాతానికి పైగా ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా రైల్వేలో ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. ఆరు నెలల క్రితం దేశవ్యాప్తంగా సుమారు లక్షా 20వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ ప్రక్రియ ముగిసి కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి కనీసం 8నెలల సమయం పడుతుంది. అప్పటికైనా పూర్తి స్థాయిలో ఉద్యోగులను కేటాయిస్తారన్న నమ్మకం లేదు.
 
 
ప్రతియేటా ఏ డివిజన్‌కు ఎంతమంది ఉద్యోగులు అవసరం అనేది జోన్‌ల వారీగా ప్రతియేటా నిర్ణయిస్తారు. దాని ప్రకారం నెలల వ్యవధిలో పోస్టుల భర్తీ ఉంటుంది. కానీ ఈ విడత 4,750 పోస్టులు ఉండాలని నిర్ణయించారు కానీ నేటికీ కూడా పోస్టులు భర్తీకాలేదు. మరో సంవత్సరం వరకు కూడా ఈ పోస్టులు భర్తీ అవుతాయనే నమ్మకం కూడా ఉద్యోగుల్లో లేదు. కారణం రైల్వేబోర్డు ఆలస్యంగా నియామకాలు చేపట్టడమే. అయితే గుంటూరు డివిజన్‌కు ఈ సమస్య రావడానికి కారణం వేగంగా అభివృద్ధి పనులు చోటుచేసుకోవడమే. రాజధాని జిల్లా కావడంతో హైదరాబాద్‌, గుంతకల్లు రూట్‌లలో ఎలక్ట్రికల్‌, డబ్లింగ్‌లకు అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. గుంతకల్లు డివిజన్‌లో ఎలక్ట్రికల్‌ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. గుంటూరు- తెనాలి డబ్లింగ్‌ లైన్లు పూర్తయి ఆదివారం నుంచి రైళ్ళ రాకపోకలు కూడా జరుగుతున్నాయి. దీంతో సిబ్బందిపై పనిభారం అనూహ్యంగా పెరిగింది. అయితే తక్షణం సమస్య పరిష్కారానికి రైల్వే జోన్‌ ప్రతినిధులు వేరే డివిజన్ల నుంచైనా కొత్త పోస్టులు భర్తీ అయ్యే వరకు ఉద్యోగుల బదిలీచేసి పనిభారం తగ్గించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డీఆర్‌ఎంను కలిసి చర్చలు జరుపనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *