‘బాలాకోట్’ ఇచ్చిన బూస్ట్.. అత్యాధునిక బాంబుల కొనుగోలుకు ఐఏఎఫ్ సై…!


న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఇటీవల జరిపిన వైమానిక దాడులు విజయవంతం కావడంతో భారత వైమానిక దళం మంచి ఊపుమీద ఉంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు స్పైస్ 2000 రకం బాంబు సరికొత్త వెర్షన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. తాజా వెర్షన్ స్పైస్ 2000 బాంబులకు లక్షిత భవనాలను, బంకర్లను తుత్తినియలు చేయగల సామర్థ్యం ఉంది.
 
బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వైమానిక దళం స్పైస్-2000 రకం బాంబులనే వినియోగించింది. నియంత్రణ రేఖను దాటి ఖైబర్ పంక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జైషే స్థావరాలపైకి దూసుకెళ్లిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు స్పైస్-2000 బాంబులను జారవిడిచాయి. పైకప్పులకు రంధ్రాలు చేసుకుని భవనాల్లోకి చొచ్చుకుపోయే రకానికి చెందిన ఈ బాంబులు జైషే మహ్మద్ భవంతులను పూర్తిగా ధ్వంసం చేయకపోయినప్పటికీ.. 70-80 కిలోల పేలుడు పదార్థాలతో లోపలికి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను చంపాయి.
 
ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల భవనాలు, బంకర్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసేందుకు అవసరమైన సరికొత్త రకం బాంబులను కొనుగోలు చేయాలని ఐఏఎఫ్ భావిస్తోంది. ‘‘బంకర్లు, భవనాలను ధ్వంసం చేయగల కొత్తరకం వెర్షన్ మార్క్ 84 బాంబులను కొనుగోలు చేయాలని ఐఏఎఫ్ సిద్ధమవుతోంది…’’ అని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నట్టు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. యుద్ధ సన్నాహాల కోసం రూ.300 కోట్ల మేర నచ్చిన ఆయుధాలను కొనుగోలు చేసేలా త్రివిధ దళాలకున్న అత్యవసర అధికారాలతో వీటిని కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. స్పైస్ 2000 రకం బాంబులను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. భారత వైమానిక దళానికి ఇజ్రాయెల్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *