బాలాకోట్ దాడుల గురించి నాకు తెలియదు: సన్నీడియోల్


ఛండీగఢ్: సైన్యాన్ని ‘మోదీ కా సేన’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువకులు పుల్వామా అమరవీరులకు నివాళిగా ఓటు వేయాలంటూ ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నా… ఆ పార్టీ గురుదాస్‌పూర్ (పంజాబ్) అభ్యర్థి, బాలీవుడ్ నటుడు సన్నీడియోల్‌కు మాత్రం బాలాకోట్ దాడుల గురించి ఏమాత్రం తెలియదట. మంగళవారంనాడు ఎన్నికల ప్రచార ర్యాలీలో సన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27న భారత వాయిసేన జరిపిన బాలాకోట్ దాడులపై మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన నిజాయితీగా స్పందించారు. ‘ఏ దాడులు? వీటి గురించి నాకేం తెలియదు. అలాగే పాకిస్థాన్‌తో ఇండియా సంబంధాల గురించి కూడా నాకు పెద్దగా తెలీదు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవ చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను’ అని ఆయన జవాబిచ్చారు.
 
ప్రధానిగా గత ఐదేళ్లలో మోదీ బాగా పనిచేశారని సన్నీడియోల్ ప్రశంసించారు. మోదీకున్న పాపులారిటీ మీకు కలిసి వస్తుందని అనుకుంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, తాను దేశం కోసం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నానని, గెలిస్తే మంచి పనులు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ కుమార్ జాఖడ్‌పై సన్నీడియోల్ పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా అమృత్‍‌సర్, గురుదాస్‌పూర్, హోషియార్‌పూర్ నుంచి బీజేపీ పోటీ చేస్తుండగా, అకాలీదళ్ తక్కిన 10 సీట్లలో పోటీ చేస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *