బీజేపీకి ఓటేయమన్న కేంద్ర బలగాలు… మమత సంచలన ఆరోపణ


అరాంబాగ్: భారతీయ జనతా పార్టీకి ఓటేయమంటూ కేంద్ర బలగాలు ఆ పార్టీ తరఫున పని చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న మాల్దహ దక్షిణ్, బలూర్‌ఘాట్ నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలు ఈ ప్రచారం సాగిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు.
 
‘కేంద్ర బలగాలు మాల్దా దక్షిణ్‌లోని ఇంగ్లీష్‌బజార్‌లో పోలింగ్ బూత్‌లలో కూర్చుని బీజేపీ ఓట్లేయమని ఓటర్లను కోరుతున్నారని నాకు సమాచారం అందింది. అలా చేయడానికి కేంద్ర బలగాలకు ఎలాంటి హక్కూ లేదు. ఈ విషయంలో మా వాదనను ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం’ అని మమత తెలిపారు. వాళ్లకి (కేంద్ర బలగాలు) అక్కడేం పని, పోలీసులు పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లకూడదని తెలియదా అని సూటిగా ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో కేంద్ర బలగాలు రాష్ట్రాలకు వస్తాయని, రాష్ట్ర బలగాలకు సహకరించి, ఆ తర్వాత రాష్ట్రం విడిచి వెళ్లిపోతాయని చెప్పారు.
 
2006లోనూ ఇదే పని చేశారు…
కేంద్ర బలగాలను బీజేపీ వాడుకోవడంపై మమత మండిపడుతూ ‘మీరు కేంద్ర బలగాలను ఉపయోగించుకోరాదు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మీరు ఇదే పని చేశారు. దాన్ని నేను మరిచిపోలేను’ అని ఆమె అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *