బీజేపీ సైద్ధాంతిక పునాది గల పార్టీ, ఏకవ్యక్తి పార్టీ కాదు : గడ్కరీ


న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నటికీ ఏక వ్యక్తి కేంద్రంగా వుండదని, బలమైన సిద్ధాంత పునాదిగానే నడుస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టారు. బీజేపీ రానూ రానూ మోదీ కేంద్రంగానే నడుస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వాజ్‌పాయ్, ఆడ్వాణీ ఉన్న రోజుల్లోనూ అలా నడవలేదని, ఇప్పుడూ అలా నడవదని స్పష్టం చేశారు. బీజేపీ సైద్ధాంతిక పునాదులున్న పార్టీ అని, మోదీ,షా‌ పార్టీ ఎన్నటికీ కాదని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరానే కాంగ్రెస్, కాంగ్రెస్సే ఇందిరా అని అప్పటి అధ్యక్షుడు డీకే బరువా నినదించినట్టు ప్రస్తుతం మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అన్నట్లు తయారైందా? అన్న ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ బీజేపీ ఎప్పటికీ వ్యక్తి కేంద్రంగా నడవదని ఆయన తెలిపారు.
 
బీజేపీలో కుటుంబ పాలన లేదని, కీలక నిర్ణయాలన్నీ కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పార్టీ బలంగా ఉండి, ఒకవేళ అభ్యర్థి బలంగా ఉంటే, అలాగే పార్టీ బలహీనంగా ఉండి, అభ్యర్థి బలంగా ఉన్నా గెలుపు సాధ్యం కాదని అన్నారు. కానీ ఒక బలమైన నాయకుడు మాత్రం అభ్యర్థిగా ఉంటే సహజంగానే పార్టీ ముందంజలో ఉంటుందని గడ్కరీ తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *