బీపీఎస్‌.. కదలిక ఏదీ?


  • బెజవాడలో 2 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌
  • ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వాకమేనంటున్న వీఎంసీ
విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి): అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వక్రమార్గం పట్టింది.. దరఖాస్తులను పరిశీలించే ప్రైవేట్‌ ఏజెన్సీ సంస్థ తప్పటడుగులే సాకుగా అధికారులు జేబులు నింపే పనిలోపడ్డారు.. ప్రభుత్వం నుంచి అందాల్సిన బిల్లులకే ప్రాధాన్యమిస్తూ ఆన్‌లైన్‌ దరఖాస్తులను సదరు సంస్థ పెండింగ్‌లో పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌ అమలై 4 నెలలు గడుస్తున్నా ఒక్క దరఖాస్తు కూడా బెజవాడ కార్పొరేషన్‌ గుమ్మం దాటలేదంటే దీని పనితీరు అర్ధం చేసుకోవచ్చు.. వీఎంసీకి చేరిన రెండువేల దరఖాస్తుల్లో 4 నెలలుగా పూర్తి చేసింది సున్నా.. ఆన్‌లైన్‌పై అధికారులు ఏ స్థాయిలో దృష్టి పెడుతున్నారో తెలుస్తోంది. బీపీఎస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను బెంగళూరుకు చెందిన సాఫ్టెక్‌ సంస్థకు ఎంఏయూడీ అప్పగించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు తోడు ప్రస్తుతం దరఖాస్తుల గడువును జూన్‌30వరకు పెంచుతూ ఎంఏయూడీ ఆదేశాలు జారీ చేయడంతో దరఖాస్తుల వెల్లువ వీఎంసీకి మళ్లీ మొదలవనుంది. జనవరి 4న జారీ అయిన బీపీఎస్‌కు 2015లో విడుదల చేసిన బీపీఎస్‌తో పోల్చితే ఈసారి దర ఖాస్తులు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. అప్పట్లో దాదాపు 10వేలకు పైగా దరఖాస్తులు కార్పొరేషన్‌కు రాగా నేడు ఆ పరిస్థితి 2 వేలకే పరి మితమవుతోంది. 10వేల దరఖాస్తులను రోజుల వ్యవధిలో నిం పేయడంలో అప్పటి కమిషనర్‌ జె.నివాస్‌ చూపిన చొరవ ప్రశంసలు అందుకోగా ప్రస్తుత అధికారుల పనితీరు విమర్శలపాలవుతోంది. 2015 నుంచి దరఖాస్తుల స్వీకరణ, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన ప్రైవేట్‌ సంస్థకు అప్పగించగా ఆ సంస్థ నేతృత్వంలోనే నాలుగేళ్లుగా దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోంది. అయితే అప్పటి బీపీఎస్‌ గడువు ముగియడంతో కొత్త బీపీఎస్‌కు ప్రభుత్వం నాంది పలికినా అదే సంస్థను కొనసాగిస్తున్నారు. కానీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణాల రీత్యా నాలుగు నెలలుగా బీపీఎస్‌ దరఖాస్తులను సంస్థ నిర్వాహకులు పెండింగ్‌లో ఉంచారని వీఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా సమస్యను టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ కు తీసుకెళ్లారు. అయితే శాఖ డైరెక్టర్‌గా ఉన్న రాముడు ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే సమస్య పరిష్కారమవుతుందని వీఎంసీ భావిస్తోంది. అయితే అప్పటి వరకు అన్ని దరఖాస్తులూ పెండింగ్‌లో ఉండాల్సిందే.
 
అధికారులకు కలిసొచ్చిన అవకాశం..
ఆన్‌లైన్‌ వ్యవస్థ నిర్లక్ష్యమే సాకుగా పలువురు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు జేబులు నింపుకొంటున్నారు. దర ఖాస్తుదారుల నుంచి పోస్టు వెరిఫికేషన్‌, ప్రీ వెరిఫికేషన్ల బా ధ్యత తమదేనని చెబుతూ వీలైనంత దండుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో అయితే ఏకంగా నిర్మాణాలకు కూడా అనధికారిక అనుమతులను అధికారులే ఇచ్చేస్తున్నారు. గవర్నరుపేట, సింగ్‌నగర్‌, పటమట తదితర ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు భారీగా జరుగుతున్నా ఏ అధికారి నోరుమెదపడంలేదు. దీనికితోడు పలువురు ప్రజా ప్రతినిధులు కూడా నిర్మాణాలపై సిఫారసులకు తెగబడుతున్నారు. ప్రజాప్రతి నిధుల పేరుతో దండుకునే అధికారులూ నగరంలో ఇటీవల పెరగడంతో అక్రమ నిర్మా ణాలకు సానుకూలమైన బీపీఎస్‌ కూడా అవినీతి అధికారులకు అక్రమార్జన తెచ్చి పెడుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *