బీపీఎస్ తో 40 వేల మందికి లబ్ధి!


  • జూన్‌ 30 వరకు మరోసారి గడువు పెంచిన ప్రభుత్వం
  • 1985-2018 మధ్య నిర్మించిన భవనాలకు అవకాశం
  • మరో 15 వేల దరఖాస్తులొస్తాయని అంచనా
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): అనుమతిలేని కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశమివ్వడంతో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌)- 2019ను ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ గడువు ముగిసేలోగా మరో 10 వేల నుంచి 15 వేల మంది దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీనితో మొత్తంగా సుమారు 40వేల మందికి లబ్ధి చేకూరవచ్చు.
 
త్వరపడితే మేలే…
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఏపీసీఆర్డీయే, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని ప్రాంతా ల్లో భవన నిర్మాణ నిబంధనలను అతిక్రమించి కొన్నేళ్లుగా వేలాది కట్టడాలు పుట్టుకొచ్చాయి. సెట్‌బ్యాక్స్‌, ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌, పార్కింగ్‌ స్పేస్‌ లేకపోవడం, సెల్లార్లను పార్కింగ్‌ కోసం కాకుండా ఇతరేతర అవసరాలకు వాడుకోవడం… ఇత్యాది అతిక్రమణల కారణంగా ఆయా భవనాల్లో నివసించే వారితోపాటు ఇతరులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదాలు జరిగితే ఆయా భవనాల్లో ఉండే వారిని రక్షించడమూ కష్టమనిపించేలా పరిస్థితులున్నాయి. మరోవైపు సరైన అవగాహన లేక ఇలాంటి భవనాల్లో గ్రూప్‌ హౌస్‌లు లేదా అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తే బ్యాంకు రుణాలు లభించవు. పైగా అనధికార కట్టడాలంటూ వీటిని సంబంధిత స్థానిక సంస్థలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రమాదమూ ఉంటుంది.
 
అనుమతుల్లేని నిర్మాణాల కారణంగా ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ.. వాటిని నిర్మించిన వారితోపాటు వాటిల్లో ఆస్తులను కొనుగోలు చేసిన వారికి ఊరట కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎ్‌సలను ప్రకటించడం పరిపాటి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ప్రభుత్వం బీపీఎ్‌స-2019ను ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. 3 నెలలపాటు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. 1985 నుంచి 2018, ఆగస్టు 31వ తేదీ మధ్య నిబంధనలను అతిక్రమించి నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశానిచ్చింది. గడువు ముగిసేటప్పటికి రాష్ట్రవ్యాప్తంగా 24 వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ పథకాన్ని పలువురు ఉపయోగించుకోలేకపోయారు. అందువల్ల మరికొంతకాలం గడువు పెంచాల్సిందిగా డీటీసీపీ వి.రాముడు ప్రభుత్వానికి నివేదించిన మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గడువు పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికి మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *