బెంగాల్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం!


  • 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు
  • దీదీ.. జాగ్రత్త! మే 23న కమలం వికసిస్తుంది
  • మీ సీఎం పదవి కాపాడుకోవడం కష్టమే
  • మమతా బెనర్జీకి ప్రధాని మోదీ హెచ్చరిక
  • ప్రధానమంత్రే బేరసారాలకు దిగారు
  • ఈసీకి ఫిర్యాదు చేస్తాం: తృణమూల్‌ కాంగ్రెస్‌
  • పీఎంవో ఔన్నత్యాన్ని దిగజార్చారు: చంద్రబాబు
మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? బేరసారాలు ఆడుతున్నారా? మీకు పోగాలం దాపురించింది. ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.
-తృణమూల్‌ కాంగ్రెస్‌
 
కోల్‌కతా, ఏప్రిల్‌ 29: ‘‘తృణమూల్‌ ఎమ్మెల్యేలు 40 మంది నాతో టచ్‌లో ఉన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ సీఎం పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది’’. ఇదీ ప్రధాని మోదీ బెంగాల్‌ సీఎం మమతకు చేసిన హెచ్చరిక! ‘మీ సర్కారునుకూల్చేస్తాం’ అని పరోక్ష సంకేతాలిచ్చారు! మోదీ.. ప్రధాని పదవి ఔన్నత్యాన్ని దిగజార్చేలా దారుణంగా మాట్లాడారు. గతంలో ఏ ప్రధానీ ఇంతటి అసాధారణ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. కోల్‌కతా సమీపంలోని సెరంపూర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘‘దీదీ.. మే 23న ఫలితాల రోజు దేశమంతటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు కూడా మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడుతున్నారు’’ అని మమతా బెనర్జీని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆమె ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కూడా కష్టమవుతుందన్నారు. ప్రజలను దారుణంగా మోసగించడమే దీనికి కారణమని చెప్పారు. గడిచిన మూడేళ్లలో బెంగాల్‌లో అనేక పోంజీ కేసులు వెలుగు చూశాయన్నారు.
 
‘‘అనుమతుల నుంచి ప్రవేశాల దాకా.. ప్రతి విషయంలోనూ ప్రజలు డబ్బును చెల్లించాల్సిందే. మమత ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా ఉంది. ప్రభుత్వ పెద్దల సిద్ధాంతాలను అంగీకరించని వారిని ఉరి తీస్తారు’’ అని మోదీ ధ్వజమెత్తారు. బెంగాల్‌లో పోలింగ్‌ హింసాత్మకంగా మారిందని, తమ అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై మోదీ మాట్లాడుతూ.. ‘‘దీదీ అణచివేత ధోరణి, పాలనకు ఇదే నిదర్శనం. చొరబాటుదారులేమో సౌకర్యవంతంగా ఉంటున్నారు. దేశభక్తులు మాత్రం భయంభయంగా బతకాల్సి వస్తోంది. గూండాలు పూర్తి భద్రంగా ఉండగా.. మన చెల్లెళ్లు, కూతుళ్ల భద్రతకు మాత్రం గ్యారంటీ లేదు’’ అని ఆరోపించారు. మరోవైపు మమత మట్టి, రాళ్లతో చేసిన రసగుల్లాలను ప్రధానికి పంపుతానని చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ.. అంత గొప్ప ‘ప్రసాదాన్ని’ పంపుతానన్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘బెంగాల్‌ గడ్డపై అనేక మంది ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు తిరిగారు.
 
నా వరకు ఇక్కడి మట్టి స్ఫూర్తిదాయకం, శక్తిమంతం. బెంగాల్‌ మట్టితో చేసే రసగుల్లాల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ చెప్పారు. జార్ఖండ్‌లోని జమువాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మహాకూటమిపై విరుచుకుపడ్డారు. మహా నకిలీ కూటమి నేతలు కేంద్రంలో కిచిడీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. మహా నకిలీ కూటమి పగ్గాలు కాంగ్రెస్‌ చేతుల్లోనే ఉన్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా మెజారిటీ సాధించలేమని ఆ పార్టీకి కూడా తెలుసని.. అందుకే కొన్ని పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఇలాంటి కూటములతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే రెండు, మూడేళ్లకోసారి ప్రధానమంత్రులు మారుతూ ఉంటారని చెప్పారు. కూటమిలోని నేతలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేదన్నారు. వారికి కేవలం ఓట్లపైనే ధ్యాస అని విమర్శించారు. ‘మిషన్‌ మహా నకిలీ కూటమి’ పట్ల తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా.. ప్రధాని వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ మండిపడింది. సాక్షాత్తూ ప్రధానే ‘బేరసారాల’కు దిగారని ఆ పార్టీ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
 
ఇది బేరసారం కాదా?: కాంగ్రెస్‌
తృణమూల్‌ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ‘‘ప్రధాని మోదీ తనతో 40 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ప్రకటించారు. ఇది బేరసారాలు చేసినట్లు కాదా? బీజేపీ దివాలాకోరు రాజకీయానికి ఇదే నిదర్శనం. నాలుగో దశ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ ఓటమిని అంగీకరించినట్లయింది’’ అని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *