భారత్-చైనా చర్చలు : మసూద్ అజహర్ ప్రస్తావన వస్తుందా?


న్యూఢిల్లీ : భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చైనా పర్యటన ఆదివారం ప్రారంభమవుతుంది. రెండు రోజులపాటు ఆయన చైనా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. చైనీస్ స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో జరిపే చర్చల సందర్భంగా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
 
భారత్-చైనా మధ్య నిరంతరం జరిగే సంప్రదింపుల్లో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. వాంగ్ యితో గోఖలే సోమవారం చర్చలు జరుపుతారని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది.
 
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని చైనాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. మసూద్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత దేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఉగ్రవాద దాడి జైషే మహ్మద్ పనేనని రుజువు చేసే సాక్ష్యాధారాలను భారత దేశం పాకిస్థాన్‌కు అందజేసింది. మసూద్‌ను ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత దేశంతోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కోరుతున్నాయి. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంటోంది. పాకిస్థాన్‌కు అత్యంత సన్నిహిత మిత్ర దేశంగా చైనా వ్యవహరిస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *