'భారత ప్రధాన విభజనదారు' రచయిత పాకిస్థానీ: సంబిత్ పాత్ర


న్యూఢిల్లీ: ‘భారత ప్రధాన విభజనదారు’గా మోదీని అభివర్ణిస్తూ ‘టైమ్’ మ్యాగజైన్‌లో కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీయుడని, బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వాయిసేన జరిపిన దాడుల కారణంగానే వాళ్లు ప్రధానిపై ద్వేషం పెంచుకున్నారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందుకు కూడా మోదీపై ఇలాంటి రాతలే రాశారని, ఈసారి కూడా అదే పునరావృతమైందని అన్నారు. ప్రధాని మోదీ 17 రకాలైన పన్నులను ఏకీకృతం చేసి జీఎస్‌టీని తీసుకువచ్చిన ‘ఏకీకృతవాది’ అని సంబిత్ పాత్ర చెప్పారు.
 
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్‌ సిద్ధూ చేసిన పలు వ్యాఖ్యలపై సంబిత్ పాత్ర విరుచుకుపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై సిద్ధూ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. పైగా 1984 అల్లర్ల నిందితుడైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సిద్ధూ చేతులు కలిపి పనిచేశారని విమర్శించారు. మోదీని, ఇతర బీజేపీ నేతలను సిద్ధూ ‘నల్ల ఆంగ్లేయులు’తో పోల్చడం సరికాదన్నారు. ఇది దేశాన్ని ప్రేమించే మోదీని, మోదీని అపారంగా అభిమానించే ప్రజలను అవమానించడమేనంటూ సిద్ధూపై నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ ఇటాలియన్ అనే విషయాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ ‘మీ ఇలాలియన్ కలర్‌ మే 23 తర్వాత వెలిసిపోనుంది’ అని ఎద్దేవా చేశారు. గాజులతో శబ్ధం చేసే పెళ్లికూతురుతో ప్రధాని మోదీని సిద్ధూ పోల్చడాన్ని కూడా సంబిత్ పాత్ర తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సెక్సీ మనస్తత్వానికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడతాయని, ఇది నవీన భారతమని, మహిళలు కూడా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *