మండిన సీమ


  • కర్నూలు, తిరుపతిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
  • కోస్తాలో స్వల్పంగా తగ్గిన గాడ్పులు
  • కొనసాగిన ఎండ తీవ్రత, ఉక్కపోత
  • వడదెబ్బకు గుంటూరులో నలుగురు మృతి
విశాఖపట్నం/గుంటూరు, మే 11(ఆంధ్రజ్యోతి): ఠారెత్తించిన ఎండ, వడగాడ్పులతో శనివారం రాయలసీమ మండిపోయింది. కర్నూలు, తిరుపతిలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే భానుడి భగభగలు ప్రారంభమై.. మధ్యాహ్నం 11 గంటలకే తీవ్రరూపం దాల్చాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు.కాగా, తెలంగాణ పరిసరాల్లో ఆవర్తనం, దాని నుంచి కొమరన్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతున్నాయి. దీంతో కోస్తాపై పడమటి గాలుల తీవ్రత తగ్గింది. ఫలితంగా కోస్తాలో వడగాడ్పుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తప్ప కోస్తాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నెల్లూరు, కావలి, విజయవాడల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లోని కొన్ని ప్రాంతాల్లో గాడ్పులు, ఎండ తీవ్రత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల శనివారం ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
 
వడదెబ్బకు నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో శనివారం వీచిన వడగాడ్పుల కారణంగా ముగ్గురు మృతి చెందారు. రెంటచింతలకు చెందిన డేగల ఏసుదానం(76), గురజాల చెరువుకట్ట సమీపంలో గుర్తుతెలియని యాచకుడు, నాదెండ్ల మండలంలోని తూబాడుకి చెందిన కిన్నెర అక్కమ్మ(55), సత్తెనపల్లిరూరల్‌ మండలం రెంటపాళ్లకు చెందిన మారిశెట్టి హనుమంతరావు(70) మృతి చెందారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *