మండుతున్న ఎండలు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. వర్షాలు కురిసినచోట ఒకరోజు లేదా రెండు రోజులు ఎండ కాస్త తగ్గినా తర్వాత మాత్రం అదరగొడుతోంది. రాయలసీమలో నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఎండలకు భూమి వేడెక్కి ఉదయం 10 గంటల నుంచి సెగలు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదుకావడం సర్వసాధారణమైపోయింది. కర్నూలులో మంగళవారం 41.1 డిగ్రీలు నమోదైంది. ఇక, కోస్తాలో సముద్ర తీరానికి ఆనుకుని వున్న ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంది. సముద్రం నుంచి వచ్చే తేమగాలులకు ఎండ తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
 
రేపటికల్లా అల్పపీడనం
శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడనుంది. తదుపరి ఇది వాయువ్యంగా పయనించి బలపడనుంది. తొలుత 36 గంటల్లో వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు ప్రాంతం మీదుగా పయనించి తమిళనాడు తీరందిశగా రానుంది. తుఫాన్‌ తీరం దిశగా వచ్చినప్పుడు తమిళనాడు, ఏపీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *