మండేకాలం


  • మార్చిలోనే భానుడి ప్రతాపం
  • ఏప్రిల్‌లో 40 డిగ్రీలు మించి ఉష్ణోగ్రతల నమోదు
  •  గడిచిన ఉష్ణోగ్రతలను దాటిపోతున్న రికార్డు
  • 8ఈ పరిస్థితి ఇంతకుముందు లేదంటున్న శాస్త్రవేత్తలు
ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఇది జనజీవనంపై ప్రభావం చూపుతోంది. సూరీడు సుర్రుమనిపిస్తుండటంతో పిన్న, పెద్ద బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌లో ఓ వారం, మే నెలంతా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఆ నెలలోనే కొన్ని రోజులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 40 డిగ్రీలు మించి ఉష్ణోగ్రత నమోదవుతోంది. సూరీడు ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
 
విజయవాడ, ఆంధ్రజ్యోతి: వేసవి అంటే చాలు విజయవాడలో పరిస్థితుల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లో నమోదవుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌లో వారం రోజులు, మే నెలంతా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి నగరంలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏప్రిల్‌ నెలలో మూడు, నాలుగు రోజులు మాత్రమే ఉష్ణోగ్రత 40డిగ్రీలు నమోదయ్యేది. ఈ ఏడాది పరిస్థితి మారింది. ఏప్రిల్‌ ఆరంభం నుంచి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటిపోతున్నాయి. 1951వ సంవత్సరం నుంచి వాతావరణ శాఖలో రికార్డులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. 1951 నుంచి 2019 వరకు పరిశీలిస్తే ఈ మధ్యలో 24 ఏళ్లలో మాత్రమే ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. కేవలం రెండు, మూడు రోజులే ఈ పరిస్థితి ఉంది. ఈనెల ఒకటో తేదీ నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. నడినెత్తిన పడుతున్న సూర్యకిరణాలు సుర్రుమనిపిస్తున్నాయి.
 
వడగళ్ల వానలు
ఒకపక్క ఎండలు మండుతున్నా ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంటుంది. వడగళ్ల వాన కుమ్మరిస్తుంది.
వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. మేఘాలు మూడు రకాలుగా ఉంటాయి. హై క్లౌడ్స్‌, లో క్లౌడ్స్‌, మిడిల్‌ క్లౌడ్స్‌గా వాటిని విభజించారు. వాతావరణంలో పవన చలనం ఆగిపోయి, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు క్యూమిలోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయి. 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఈ మేఘాలు కరిగిపోతాయి. అదే వడగళ్ల వానగా నేలకు చేరుతుంది.
 
అంత వేడి ఎందుకంటే..
వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండానికి నల్లరేగడి నేలలు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతను ఈ నేల త్వరగా ఆకర్షిస్తుందని వారి వాదన. కాలాన్ని బట్టి సూర్యగమనం మారుతోంది. మార్చి నెల వరకు చెన్నై, దక్షిణాది రాష్ర్టాల్లో ఉంటాడు. ఏప్రిల్‌ నెల నాటికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వైపు గమనం మారుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ కేంద్రంగా సూర్యుడు కేంద్రీకృతమై ఉంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విదర్భలో నల్లరేగడి నేలలు విస్తారంగా ఉంటాయి. సూర్యరశ్మిని ఈ నేలలు అధికంగా ఆకర్షించుకుంటాయి. పైగా ఆ ఉష్ణోగ్రతకు ఈ నేలలు త్వరగా వేడెక్కుతాయి. వాతావరణంలో ఎలాంటి పవన చలనం లేనప్పుడు వేడి ఎక్కువవుతుంది. దీన్నే కాల్‌పాయింట్‌గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు.
ఈ పరిస్థితి ఎక్కువగా ఉత్తర తెలంగాణలో ఉంటుంది. ఆ తర్వాత ఏపీలో కనిపిస్తుంది. విజయవాడలో మాత్రం మార్చి 27 నుంచే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటిపోవడం గమనార్హం. మార్చి 27న 41 డిగ్రీల ఉష్రోగ్రత నమోదవ్వగా 28న 43, 29న 41, 30న 42, 31న 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ 41, రెండో తేదీ 40 డిగ్రీలుగా ఉష్ణోగ్రత ఉంది. ఇక అప్పటి నుంచి ఉష్ణోగ్రతలు 40కి దిగి కిందికి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
 
తస్మాత్‌ జాగ్రత్త
ఎండలు ఒక స్థాయిని మించి నమోదవుతున్నప్పుడు మరణాలు సంభవించవచ్చు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతం నుంచి వేడి గాలులు తీవ్రంగా వీస్తాయి. వాటిని నిరోధించే స్థాయిలో మన వద్ద పచ్చదనం లేదు. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినప్పుడే హీట్‌వేవ్స్‌ను తగ్గించగలం.
-జి.వి. సత్యనారాయణ, ప్రొఫెసర్‌, కేఎల్‌ వర్సిటీ, వాతావరణ పరిశోధన విభాగం
 
ఇప్పటి వరకు ఏప్రిల్‌లో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు
1956 41.02
1969 40.02
1973 42.42
1974 41.12
1978 40.02
1979 40.73
1982 40.14
1984 41.75
1985 42.48
1987 40.87
1989 41.28
1990 41.06
1991 42.58
1992 40.85
1993 40.64
1999 41.02
2000 40.61
2003 40.15
2004 40.43
2013 40.51
2015 40
2016 41
2017 40
2018 40
2019 43

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *