మండ్యలో విజయం ఎవరిదనే దానిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే..!


బెంగళూరు: మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో తన పుత్రరత్నం నిఖిల్‌కుమార్‌ గెలుపుపై ముఖ్యమంత్రి కుమారస్వామి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. టెన్షన్‌తో ఆయనకు నిద్ర కరువైంది. మండ్యలో ఒకవేళ పుత్రరత్నం ఓడిపోతే రాజకీయంగా అది తన ప్రతిష్టను దిగజారుస్తుందని సీఎం భయపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అస్థిరత భయంతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని పలు సమీక్షలు కోడై కూస్తున్నాయి.
 
మండ్యలో బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీశ్‌, కాంగ్రెస్-జేడీఎస్‌ మిత్ర పక్షాల అభ్యర్థి నిఖిల్‌కుమార్‌కు గట్టి పోటీయే ఇచ్చారు. మండ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు తన పుత్రరత్నం విజయానికి కృషి చేయలేదని కుమారస్వామి అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కాంగ్రెస్‌ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. అనివార్య పరిస్థితుల్లో మండ్యలో సీఎం కుమారుడి విజయానికి కృషి చేయని కొందరు నేతలను గుర్తించిన కాంగ్రెస్‌ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే సన్నాహాల్లో ఉన్నారు. మండ్య నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగిన రోజు తన కుమారుడికి 3 లక్షలకుపైగా మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం కుమారస్వామి గత రెండు రోజులుగా దాన్ని సగానికి తగ్గించారు. జేడీఎస్‌ శ్రేణులు మాత్రం కొద్దిపాటి మెజారిటీతోనైనా నిఖిల్‌ గట్టెక్కుతారని అంటున్నా సీఎంకు మాత్రం గుబులు కొనసాగుతూనే ఉంది.
 
ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా నిఖిల్‌ గెలుపుపై అనుమానం వ్యక్తం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని 50శాతం మంది మహిళలు సుమలతకు ఓటు వేసియుంటే నిఖిల్‌ గెలుపు అసాధ్యమనే మాట వినిపిస్తోంది. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రైతు సంఘం కూడా ఏకపక్షంగా సుమలతకే పనిచేసింది. ఇక కాంగ్రెస్‌లోని తిరుగుబాటు నేతలు కూడా సుమలతకు అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *