మదనపల్లెలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు


  • కుమార్తె ఇంటికి వహీద్‌ హసన్‌ దంపతులు
  • మనవడితో ఆడుకొని.. ఉల్లాసంగా గడిపారు
మదనపల్లె, ఏప్రిల్‌ 28: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ వహీద్‌ హసన్‌ చిత్తూరు జిల్లా మదనపల్లెకు విచ్చేశారు. ఇక్కడ నివసిస్తున్న కుమార్తె ఫిదాను చూసేందుకు వచ్చిన హసన్‌ దంపతులకు ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఫిదా మదనపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన పెద్దమ్మ దేవుడమ్మ… మదనపల్లెలో మదర్‌మీరా ఆశ్రమంతోపాటు అదే పేరుతో పాఠశాలలను నడుపుతున్నారు. ఆమెకు జర్మనీ, అమెరికా, సింగపూర్‌ తదితర దేశాల్లోనూ ఆశ్రమాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జర్మనీలోని ఓ ఆశ్రమంలో ఉన్న దేవుడమ్మను చూడటానికి జనార్దన్‌రెడ్డి వెళ్లారు.
 
హసన్‌ భార్య ఇలహాహసన్‌ కూడా అదే ఆశ్రమంలో ఉండేవారు. తల్లిని చూడటానికి ఫిదా ఆ ఆశ్రమానికి వెళ్లినప్పుడు జనార్దన్‌రెడ్డితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2016లో మతాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఫిదా మదనపల్లెలో ఉంటున్నారు. కూతురిని, మనవడిని చూడటానికి హసన్‌ దంపతులు ఆదివారం మదనపల్లెకు వచ్చారు. కూతురు, అల్లుడితో ఉల్లాసంగా గడిపారు. ఏడాదిన్నర వయసున్న మనవడితో ఆడుకున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు విచ్చేసిన వీరికి స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం హసన్‌ దంపతులు బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి విమానంలో మాల్దీవులకు పయనమవుతారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *