మధ్యప్రదేశ్‌ ‘మామా’


  • పదమూడేళ్లపాటు సీఎంగా కీలక బాధ్యతలు
  • సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తీవ్ర కృషి
నవ్విన నాప చేనే పండుతుందని సామెత! మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విషయంలో అదే నిజమైంది! ఆయన సీఎం కాక ముందు సంగతి. రాజకీయ ప్రత్యర్థులంతా ఆయన్ను ‘పప్పూ’ అని ఎద్దేవా చేసేవారు. కానీ, శివరాజ్‌సింగ్‌.. అక్షరాలా 13 సంవత్సరాలపాటు మధ్యప్రదేశ్‌ను ఏలి ప్రత్యర్థుల విమర్శలకు తన సమర్థతతో జవాబిచ్చారు. ప్రత్యర్థులకు ఆయన పప్పూ కావచ్చుగానీ.. ప్రజలకు మాత్రం ఆయన ‘మామా’. 2018లో ఓడిపోయినా.. కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘మామా’దే కీలకపాత్ర.
 
వ్యక్తిగతం
పూర్తిపేరు : శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
పుట్టినరోజు : 1959, మార్చి 5
విద్యార్హత : ఎంఏ ఫిలాసఫీ
భార్య : సాధనాసింగ్‌ చౌహాన్‌
పిల్లలు : కార్తికేయ చౌహాన్‌, కునాల్‌ చౌహాన్‌
 
శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ సీఎం అయ్యేనాటికి.. ప్రధాని నరేంద్రమోదీకి ఉన్నంత కరిష్మా ఆయనకు లేదు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన ఉమాభారతిలాగా మాస్‌ లీడర్‌ కాదు. మరి ప్రజాదరణ పొందాలంటే ఏంచేయాలి? తన పాలన ద్వారా ఆకట్టుకోవాలి. అదే చేశారాయన. 1993 నుంచి 2003 దాకా.. పదేళ్లపాటు సీఎంగా ఉన్న దిగ్విజయ్‌ని గద్దెదించి బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్‌ చీకట్లలో ఉంది. కరెంటు లేదు.. రైతుకు సాగునీరు లేదు. రోడ్లు లేవు. ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌ ముఖ్యమంత్రి అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఆ సమయంలో బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో 2005లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సంక్షేమాన్ని అభివృద్ధితో ముడిపెట్టి అద్భుతఫలితాలు సాధించారు. చాలా మంది బీజేపీ నేతల్లాగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా స్వయం సేవక్‌. తన పదమూడో ఏటే ఆరెస్సెస్‌లో చేరి.. రాజకీయాలవైపు మళ్లి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారు. 2005లో మధ్యప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
 
సంక్షేమ సారథి..
ఉచిత టీవీలు.. రూపాయికి కిలోబియ్యం.. అమ్మాయి పుడితే జాతీయ పొదుపు పత్రాలు.. గర్భిణులకు పౌష్టికాహారం.. ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ప్రభుత్వం డబ్బు ఇవ్వడం.. ఈ పథకాల గురించి చెప్పగానే చాలా మందికి దక్షిణాది రాష్ట్రాలే గుర్తొస్తాయి. కానీ, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలివి. దక్షిణాదిన పలు ప్రాంతీయ పార్టీలకు భారీ మెజారిటీలు తెచ్చిపెట్టిన ఈ ఫార్ములానే ఆయన కూడా అనుసరించారు. అయితే, ఇవి కాదు.. ఆయన విజయం వెనుక ఉన్న మరో కారణం.. చాలా మంది రాజకీయ విశ్లేషకులకు కూడా మొదట్లో అర్థంకాని వ్యూహం వేరే ఉంది. అదేంటంటే.. ఆయన తన పథకాల్లో మహిళలకు పెద్ద పీట వేసేవారు.
 
ఎందుకంటే.. కులాలు, వర్గాలవారీ పథకాల వల్ల కొంత శాతం ఓట్లే వస్తాయి. అదే మహిళల సంక్షేమానికి అవసరమైన పథకాలు అమల్లోకి తెస్తే వారికి, తమ పార్టీకి మేలు జరుగుతుందన్నది ‘మామా’ వ్యూహం. లాడ్లీ లక్ష్మి యోజన అయితే.. కడుపులోనే ఆడపిల్లలను చిదిమేసే దురాచారానికి కూడా చెక్‌ పెట్టింది. అదే ఆయనను 13 ఏళ్లపాటు సీఎం పీఠంపై ఉంచింది. 2018లో మధ్యప్రదేశ్‌లో కాషాయపార్టీ కాంగ్రెస్‌కు ‘నువ్వా-నేనా’ స్థాయిలో పోటీ ఇచ్చిందంటే కారణం ఇదే.
 
ఉపసంహారం: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 1975లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎవ్వరూ ఊహించలేదు.. ఏదో ఒకనాడు ఆయన సీఎం అవుతారని! ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎవరూ అనుకోలేదు.. ఆయన పదమూడేళ్లు ఏలుతారని!! రెండుసార్లూ తనను తక్కువ అంచనా వేసినవారు తప్పు అని.. ‘మామా’ నిరూపించారు. అందుకే.. ఈ ఎన్నికల్లో కూడా పార్టీకి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించే బాధ్యత పార్టీ ఆయనపైనే పెట్టింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *