మరీ అంతగా నటించొద్దు: ప్రియాంకపై స్మృతి విసుర్లు


అమేథి: యూపీలోని అమోథీ నియోజకవర్గంలో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. ప్రధాన అభ్యర్థులు, ప్రచార సారథుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాహుల్ తరఫున అమేథీలో సోమవారం ప్రచారం సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా తనపై చేసిన వ్యాఖ్యలను అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. ప్రియాంక తెగ నటించేస్తున్నారంటూ ప్రతి విమర్శలు చేశారు.
 
‘నేను నటిని, ప్రియాంక నటించకుండా ఉంటే మంచిది. పేద ప్రజలకు కనీసం పాదరక్షలు కూడా లేవు. ముందు ఆమె (ప్రియాంక) హరిహర్‌పూర్ వెళ్లి మాట్లాడితే బాగుంటుంది. అసలు హరిహర్‌పూర్ ఎక్కడుందో జాడతెలియకుండా పోయిన ఎంపీని ఆమె అడిగితే ఇంకా మంచిది’ అని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌ను బీజేపీ నేతలు ‘మిస్సింగ్ ఎంపీ’ అంటూ విమర్శించడం పారిపాటి.
 
కాగా, అంతకుముందు అమేథిలో పర్యటించిన ప్రియాంక… స్మృతి ఇరానీపై విరుచుకుపడ్డారు. అమేథిలో స్మృతి పర్యటించి షూలు పంచడం సిగ్గుచేటని, ఇది ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. అమేథీ ప్రజలు ఎప్పుడూ చేయిచాచలేదని, తీసుకున్న పాదరక్షలను తిరిగిచ్చేయండని కోరారు. ఓట్ల కోసం స్మృతి ఇరానీ ప్రజలకు తప్పుడు హామీలిస్తున్నారని, అబద్ధాలతో ఎవరినైనా నమ్మించగలరేమోనని, అమోథీ ప్రజలను కాదని అన్నారు. అమేథీ, రాయబరేలి ప్రజలకు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం పట్ల అవ్యాజమైన గౌరవం, ప్రేమ ఉందన్నారు. తన తండ్రి రాజీవ్, రాహుల్ గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారని, వారణాసిలో మాత్రం మోదీ ఒక్క గ్రామాన్ని కూడా ఎప్పుడూ దర్శించన పాపాన పోలేదని విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *