మరో అడుగు


  • ఆర్వీ కాంట్రాక్ట్‌ సంస్థకు విజయవాడ బైపాస్‌!
  • డీపీఆర్‌ రూపకల్పన టెండర్లను దక్కించుకున్న సంస్థ
  • 48 కిలోమీటర్ల ఆరు లేన్ల బైపాస్‌తో పాటు..
  • కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జికి.. వేర్వేరుగా డీపీఆర్‌లు
  • కొత్త ప్రభుత్వం కొలువు తీరిన ఆరు నెలలకు రిపోర్టు
విజయవాడ బైపాస్‌ పనులకు డీపీఆర్‌ తయారు చేయడానికి కన్సల్టెన్సీ సంస్థ ఎంపికైంది. మొత్తం ఏడు సంస్థలు పోటీపడగా ఆర్వీ కన్సల్టెన్సీ కాంట్రాక్టును దక్కించుకుంది. అగ్రిమెంటు జరిగిన ఆరు నెలల లోపు ఈ సంస్థ డీపీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్వీ సంస్థ గతంలో జిల్లాలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు డీపీఆర్‌లను సమర్పించింది. వీజీటీఎం – ఉడా పరిధిలో జీఐఎస్‌ వంటి పనులు నిర్వహించింది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బెజవాడ బైపాస్‌ పనులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారుచేయటానికి కన్సల్టెన్సీ సంస్థ ఎంపికైంది. ముచ్చటగా మూడోసారి పిలిచిన టెండర్లలో ఏడు సంస్థలు పోటీ పడగా.. ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్‌ రూపకల్పన బాధ్యత కాంట్రాక్టును దక్కించుకుంది. మరో సంస్థ జాయింట్‌ వెంచర్‌తో ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ దీనికి సంబంధించిన టెండర్లలో పాలు పంచుకుంది. ఈ నెలలో జాతీయ రహదారుల సంస్థ తెరిచిన టెండర్లలో ఆర్వీ కన్సల్టెన్సీ అతి తక్కువ రేటును కోట్‌ చే సింది. వెంటనే మరో ఆలోచనకు తావు లేకుండా ఎన్‌హెచ్‌ అధికారులు ఆర్వీ సంస్థను ఎంపిక చేశారు. ఈ సంస్థతో, ఎన్‌హెచ్‌ అధికారులు ఇంకా అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంది.
 
అగ్రిమెంట్‌ మరికొద్ది రోజులలో జరిగే అవకాశం ఉంది. అగ్రిమెంట్‌ జరిగిన ఆరు నెలల లోపు ఆర్వీ సంస్థ డీపీఆర్‌ను రూపొందించి ఎన్‌హెచ్‌కు అప్పగించాల్సి ఉంటుంది. మే మొదటి వారంలో ఆర్వీ, ఎన్‌హెచ్‌ల మధ్య అగ్రిమెంట్‌ జరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఆరు నెలలు అంటే డిసెంబర్‌ నాటికి డీపీఆర్‌ రూపొందే అవకాశం ఉంటుంది. విజయవాడ బైపాస్‌ అనేది విజయవాడ – గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగం. ఈ ప్రాజెక్టును బీఓటీ విధానంలో దక్కించుకున్న ’ గామన్‌ ’ సంస్థ చేయలేక చేతులెత్తేయటంతో ఈపీసీ విధానంలో ముందుకు వెళ్లటానికి తీవ్ర జాప్యం జరిగింది. ఈపీసీ విధానంలో టెండర్లు పిలవాలని నిర్ణయించిన ఎన్‌హెచ్‌ ఈ ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ఫేజులో భాగంగా గుండుగొలను – జంక్షన్‌ వరకు ఆరులేన్ల రోడ్డు విస్తరణ, నాలుగు లేన్ల జంక్షన్‌ బైపాస్‌ , జంక్షన్‌ నుంచి పెదఅవుటపల్లి వరకు ఆరు లేన్ల బైపాస్‌ను నిర్మించటానికి డీపీఆర్‌ను రూపొందించిన తర్వాత టెండర్లు పిలిచింది. ఒకసారి టెండర్లు రద్దు చేసిన ఎన్‌హెచ్‌ రెండోసారి పిలిచిన టెండర్లను ఖరారు చేసింది. రెండవసారి పిలిచిన టెండర్లలో లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇదే సంస్థ ప్రస్తుతం పెదఅవుటపల్లి – కనకదుర్గ వారధి వరకు విజయవాడ వీఐపీ కారిడార్‌ పనులను కూడా చేపట్టింది. విజయవాడ – గుండుగొలను ఫేజ్‌ – 1 పనులను కూడా ఈ సంస్థ చేపట్టింది. ఫేజ్‌ – 2 లో భాగంగా విజయవాడ బైపాస్‌ను 48 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాగే కృష్ణానదిలో బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. గతంలో ఈ రెండింటినీ నాలుగు లేన్లుగా ప్రతిపాదించటం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్పులు, చేర్పులు సూచించింది.
 
ప్రతిపాదనలకు సానుకూలం
రాజధాని ప్రాంతంలో చేపట్టే పనులు కావటంతో విజయవాడ బైపాస్‌తో పాటు, కృష్ణానదిలో బ్రిడ్జిని కూడా ఆరు వరుసల విధానంలో నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం కూడా సానుకూలంగానే స్వీకరించింది. కృష్ణానదిపై ఆరు వరుసల ఐకానిక్‌ బ్రిడ్జికి, చిన అవుటపల్లి నుంచి సూరాయపాలెం వరకు … కృషానది మినహా ఆవల కాజ వరకు విజయవాడ బైపాస్‌ను కూడా వైవిధ్యభరితంగా ఆరు వరుసలుగా నిర్మించటానికి డీపీఆర్‌ రూపొందించాల్సిందిగా ఎన్‌హెచ్‌ టెండర్లు పిలిచింది. ఎన్‌హెచ్‌ పిలిచిన టెండర్లకు మొదటిసారి ఒక సంస్థే వచ్చింది. దీంతో ఆ టెండర్లను రద్దు చేసింది. రెండోసారి రెండు సంస్థలు మాత్రమే వచ్చాయి. దీంతో మూడోసారి టెండర్లను పిలిచింది. ఈధపా ఏడు సంస్థలు పోటీకి వచ్చాయి. వాటిలో ఆర్‌వీ సంస్థ టెండర్లను దక్కించుకోవటం విశేషం. ఆర్‌వీ సంస్థ గతంలో జిల్లాలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు డీపీఆర్‌లను సమర్పించింది. వీజీటీఎం – ఉడా పరిధిలో జీఐఎస్‌ వంటి పనులు నిర్వహించింది.
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *