మరో రెండు నెలలు ఆగాల్సిందే!


  • స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని రద్దు చేసిన ఏఎంఆర్‌సీ
  • కోడ్‌ కారణంగా హాజరుకాని మంత్రి నారాయణ
  • అధికారుల నిర్ణయం ఇబ్బందికరం అవుతుందేమోనని భావన
  • మళ్లీ జూన్‌లో సమావేశం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): అనుకున్నట్టే అయింది.. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు భవితవ్యంపై ప్రతిష్టంభన ఏర్పడింది.. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవటానికి మరో రెండు, మూడు నెలలు ఆగాల్సిందే! వచ్చే జూన్‌, జూలై మాసాలలో దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం జరగాల్సిన స్టీరింగ్‌ కమిటీ సమావేశం రద్దయింది. కోడ్‌ కారణంగా పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పాల్గొనలేకపోవటంతో.. అధికారులుగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమౌతుందోనన్న మీమాంసతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) సమావేశాన్ని అర్థంతరంగా రద్దు చేసింది. సమావేశాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని డీపీఆర్‌ రూపొందించిన సంస్థ ‘శిస్ర్టా’ బృందానికి తెలియపరిచింది.
 
దీంతో శిస్ర్టా బృందం సమావేశానికి హాజరు కాలేదు. ఎలాగూ విజయవాడ నగరానికి వచ్చినందున కేవలం అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) అధికారులతో ఈ వారంరోజుల పాటు అంతర్గత సమావేశాల్లో పాల్గొంటారు. లైట్‌ మెట్రో ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావటంతో దీనిపై తప్పనిసరిగా ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేబినెట్‌ మంత్రి స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నందున ప్రభుత్వ విధానపరమైన అంశాలకు దగ్గరగా నిర్ణయం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్‌ కారణంగా మంత్రి ఈ సమావేశంలో పాల్గొనలేకపోవటంతో ఉన్నతాధికారులే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ తదితరులు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిస్థాయిలో సమావేశంలో పాల్గొన్న అధికారులంతా సొంత నిర్ణయం తీసుకుంటే మళ్లీ ప్రభుత్వం కొలువు తీరితే ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) ఉన్నతాధికారులు భావించారు.
 
ఏ ప్రభుత్వం వచ్చినా ఇబ్బందికరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాలన్న ఉద్దేశ్యంతో ఏఎంఆర్‌సీ, స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని అర్థంతరంగా రద్దు చేసింది. దీంతో మే 23 ఫలితాల ప్రకటన తర్వాత కొలువు తీరే ప్రభుత్వం చేతిలోనే లైట్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. మే 23న ఫలితాలు వస్తాయి. జూన్‌ మాసంలో ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉంటుంది. ఈ లోపు కేబినెట్‌ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కేబినెట్‌ ఏర్పడిన తర్వాత పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించేవారు స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి ఆయన నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై రానున్న ఐదేళ్ల కాలంలో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ముఖచిత్రం ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు భవితవ్యంపై నగర ప్రజలలో అనేక సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కొనసాగితే ఏదో ఒక రకంగా ప్రాజెక్టు ముందుకు వెళుతుందని, ప్రభుత్వం మారితే తలనొప్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న భావన వ్యక్తమౌతోంది. ప్రభుత్వం మారితే లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చినా.. కొత్త ప్రభుత్వం వచ్చినా.. రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన ప్రాజెక్టు కాబట్టి మెట్రో ప్రాజెక్టు అన్నదానిని తొలగించటం కుదరని పని…!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *